ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులు అనేవి చాలా మందికి వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్తవ్యవస్తమైన జీవన విధానంల వల్లే చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. దీంతో యుక్త వయస్సులోనే హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. అయితే కింద తెలిపిన యోగా ఆసనాలను రోజూ వేస్తే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ ఆసనాలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఉత్థిత త్రికోణాసనం
నేలపై నిలబడి కాళ్లను ఎడంగా చాపాలి. ఇప్పుడు కుడి కాలిని మరింత దూరంగా జరిపి దాని పాదాలను కుడి చేతితో అందుకోవాలి. అలాగే ఎడమ చేయిని నిట్ట నిలువుగా పైకి ఉంచాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండి మళ్లీ సాధారణ స్థితికి రావాలి. ఇలా ఇంకో వైపు కూడా చేయాలి. ఈ ఆసనాన్ని 4-5 సార్లు వేయాలి.
2. పశ్చిమోత్తాసనం
నేలపై కూర్చోవాలి. కాళ్లను ముందుకు చాపి దగ్గరగా ఉంచాలి. తరువాత ముందుకు వంగి మోచేతులను పాదాల వద్దకు తేవాలి. అనంతరం చేతులతో పాదాలను చుట్టేయాలి. తలను పూర్తిగా కిందకు వంచి కాళ్లపై ఆనించాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. తరువాత సాధారణ స్థితికి రావాలి. దీన్ని కూడా రోజూ 4-5 సార్లు చేయాలి.
3. అర్ధ మత్య్సేంద్రాసనం
నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. ఎడమకాలిని తీసి కుడికాలి మీదుగా వేయాలి. ఎడమ కాలి పాదం కుడి మోకాలికి అవతలి వైపు వచ్చేలా వేయాలి. తరువాత కుడి చేత్తో ఎడమ మోకాలిని కుడి వైపుకు వంచినట్లు చేయాలి. ఈ క్రమంలో తలను ఎడమ భుజం మీదుగా పక్కకు తిప్పి చూడాలి. ఎడమ చేతిని నేలపై ఆనించి వీపు నుంచి దూరంగా జరపాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండి సాధారణ స్థితికి వచ్చి ఇంకో వైపుకు కూడా అలాగే చేయాలి. దీన్ని రోజుకు 3-4 సార్లు వేయాలి.
ఈ విధంగా పైన తెలిపిన మూడు యోగా ఆసనాలను రోజూ వేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. బీపీ తగ్గుతుంది.