Pooja Hegde : సినిమా హీరోలకు ఉండే అభిమానులు తమ హీరోను ఎవరు ఏమన్నా సహించరు. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తమ హీరోకు అవమానం జరిగితే తమకు జరిగినట్లే భావిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. తమ హీరోకు అవమానం జరిగిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డెపై వారు మండిపడుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డె కాంబినేషన్‌లో త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం విదితమే. ఇటీవలే ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక అతడు, ఖలేజా తరువాత త్రివిక్రమ్‌కు మహేష్‌తో ఇది మూడో సినిమా.. కాగా పూజాతో కూడా త్రివిక్రమ్‌కు మూడో సినిమాయే.
గతంలో అరవింద సమేత, అల వైకుంఠ పురములో చిత్రాల్లో పూజా హెగ్డె నటించింది. ఈ మూవీలకు త్రివిక్రమ్ దర్శకుడు. దీంతో త్వరలో తెరకెక్కబోయే చిత్రం పూజా, త్రివిక్రమ్‌లకు కూడా మూడో సినిమా కానుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను పూజా హెగ్డె తాజాగా పంచుకుంది. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. మహేష్, తాను కలిసి ఓ చిత్రంలో చేయబోతున్నాము.. అని తెలియజేసింది.
అయితే ఆమె మహేష్‌ను సర్.. అనకుండా మహేష్ అని సంబోధించింది. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మహేష్ ను మహేష్ సర్ అని పిలవాలని.. ఆయనకు గౌరవం ఇవ్వకుండా మామూలుగా ఎందుకు పిలిచావని.. పూజాపై ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై పూజా హెగ్డె ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఆమె స్పందిస్తుందేమో చూడాలి.