Bigg Boss Ott : అంతటా మంచి హిట్ అయిన బిగ్ బాస్ షో తెలుగులోనూ అశేష ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ సారి కొత్తగా బిగ్ బాస్ ఓటీటీ పేరుతో తెలుగులోనూ లాంచ్ చేశారు. 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యిందంటూ ప్రోమోల ద్వారా తెగ దంచేశారు. ఫిబ్రవరి 26 శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం అవుతుండగా, 3, 4, 5 సీజన్లకు హోస్ట్‌గా హ్యాట్రిక్ కొట్టిన నాగార్జునే.. బిగ్ బాస్ ఓటీటీకి హోస్టింగ్ చేస్తున్నారు. ఈ షోలో కొత్త వాళ్ళను ఒక గ్రూప్ గా, పాత వాళ్ళను ఓ గ్రూప్ గా విడదీసి, వాళ్ళ మధ్య ఆసక్తికర టాస్కులు పెడుతున్నారు.
హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోను రోజుకు రెండు ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు. అయితే లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని ప్రేక్షకులు మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో షోను మొత్తానికే ఆపేసి వీక్షకులకు షాక్ ఇచ్చారు మేకర్స్. బుధవారం అర్ధరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిలిపి వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించింది. గురువారం అర్ధరాత్రి అంటే 12 గంటల నుంచి రీస్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇలా చేయడానికి కారణమేంటా అనే దానిపై అభిమానులు అనేక ఆలోచనలు చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం షోను లైవ్ లా కాకుండా ఒక గంట ఆలస్యంగా ప్రసారం చేస్తూ, రోజూ నైట్ ఓ ఎపిసోడ్ ను విడుదల చేయనున్నారట. ఇదంతా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికే అంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమై నాలుగే రోజులైనా తెలుగులో పెదవివిరుపులు ఎక్కువయ్యాయి. ఇంకా విచిత్రం ఏంటంటే.. బిగ్ బాస్ వస్తుందా ? అని విచిత్రంగా అడిగేవాళ్లు ఉన్నారంటే.. ఈ ఓటీటీ షోపై తెలుగు ఆడియన్స్‌లో ఆసక్తి ఎంత సన్నగిల్లిందో అర్ధం చేసుకోవచ్చు. 84 రోజులని ముందే అనౌన్స్ చేసేశారు కాబట్టి.. తప్పదన్నట్టు నడిపించాల్సిందే మరి.