Manchu Vishnu : నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజా వివాదం మరింత ముదురుతోంది. ఆయన ఇంకా ఈ సమస్యలో కూరుకుపోతున్నారు. ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి పెద్దదవుతోంది. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ వివాదం విషయం బీసీ సంఘాల వరకు వెళ్లింది. దీంతో ఆ సంఘాలు మంచు విష్ణు, మోహన్‌బాబులపై మండిపడుతున్నాయి. వెంటనే వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇటీవలే మంచు విష్ణు తన ఆఫీస్‌లో రూ.5 లక్షల విలువైన మేకప్ సామగ్రి చోరీ అయిందని.. అందుకు కారణం తన వద్ద పనిచేస్తూ మానేసిన నాగశ్రీనునే అని ఆరోపిస్తూ అతనిపై కేసు పెట్టారు. అయితే అనూహ్యంగా నాగశ్రీను తెరమీదకు వచ్చి తనను మోహన్‌బాబు, విష్ణులు కొడుతూ దూషించారని.. కులం పేరిట అవమానించారని.. సెల్ఫీ వీడియో ద్వారా వివరాలను వెల్లడించాడు. దీంతో ఈ విషయంపై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఇది నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాల వరకు వెళ్లింది.
ఈ విషయంపై నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ మాట్లాడుతూ.. నాగశ్రీనును కులం పేరిట దూషించడం దారుణమని.. ఏదైనా ఉంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని.. అంతేకానీ అతన్ని కొడుతూ కులం పేరిట దూషించడం దారుణమని.. ఈ విషయంలో మంచు విష్ణు, మోహన్ బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇక దీనిపై జాతీయ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. మోహన్‌బాబు చాలా దారుణంగా ప్రవర్తించారని.. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 1 శాతం జనాభా ఉన్న వర్గానికి చెందిన నువ్వు 56 శాతం జనాభా ఉన్న వర్గానికి చెందిన వ్యక్తిని దూషించడం తగదని.. బీసీలు అందరూ తలచుకుంటే.. తగిన బుద్ధి చెబుతారని.. అన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సంఘనలు అన్నింటిపై మంచు ఫ్యామిలీ స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.