హైబీపీ.. రక్తపోటు.. ఎలా చెప్పినా.. ప్రస్తుతం ఈ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బాధ పడుతున్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తోంది. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఉంది. అందుకు కింద తెలిపిన పదార్థాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది.
1. అశ్వగంధ
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ అశ్వగంధ పొడి కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఇలా చేయడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. అశ్వగంధ చూర్ణంతో తయారు చేసిన ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. వీటిని ఉదయం సాయంత్రం భోజనం చేశాక తీసుకోవచ్చు. మార్కెట్‌లో మనకు 250ఎంజీ, 500ఎంజీ మోతాదులో ఈ ట్యాబ్లెట్లు లభిస్తాయి. అయితే ముందుగా 250 ఎంజీ మోతాదుతో ప్రారంభించవచ్చు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున వాడుతూ సమస్యకు అనుగుణంగా మోతాదును పెంచవచ్చు. అయితే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయినప్పటికీ వైద్య సలహా మేరకు వాడుకుంటే మంచిది.
2. తులసి
రోజూ పరగడుపునే ఐదారు తులసి ఆకులను అలాగే నమిలి మింగాలి. లేదా తులసి ఆకులతో టీ తయారు చేసుకుని కూడా తాగవచ్చు. తులసి ట్యాబ్లెట్లు కూడా మనకు లభిస్తాయి. వీటిని కూడా వాడుకోవచ్చు. తులసి ఆకుల్లో ఉండే యుజినాల్ అనబడే సమ్మేళనం హైబీపీని తగ్గిస్తుంది. తులసిని వాడడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.
3. ఉసిరి
నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒక పెద్ద ఉసిరికాయను తినాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల ఉసిరికాయ రసాన్ని కలుపుకుని తాగవచ్చు. ఉసిరి ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. ఎండు ఉసిరికాయల పొడి కూడా లభిస్తుంది. వీటిల్లో దేన్నయినా ఉపయోగించవచ్చు. ఉసిరికాయ పొడిని వాడితే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల పొడిని కలుపుకోవాల్సి ఉంటుంది. ఉసిరికాయలను వాడడం వల్ల హైపీబీ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. దీని వల్ల రక్తనాళాలు వెడల్పు అవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
4. త్రిఫల
ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల. త్రిఫల చూర్ణాన్ని వాడడం వల్ల అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు హైబీపీని తగ్గిస్తాయి. రోజూ రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల త్రిఫల చూర్ణాన్ని కలుపుకుని తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
5. అర్జున
అర్జున వృక్షం బెరడులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ బెరడును ఎన్నో ఔషధాల తయారీలో వాడుతారు. గుండె ఆరోగ్యానికి అర్జున బెరడు అద్భుతంగా పనిచేస్తుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. హైపీబీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అర్జున బెరడు చూర్ణం మనకు మార్కెట్‌లో లభిస్తుంది. బెరడును కూడా నేరుగా కొనుగోలు చేయవచ్చు. దాన్ని చూర్ణం చేసుకుని ఉపయోగించవచ్చు. ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ అర్జున బెరడు చూర్ణం కలిపి ఉదయం, సాయంత్రం భోజనం చేశాక తీసుకుంటే ఫలితం ఉంటుంది. అర్జున ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. వాటిని కూడా వాడుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో ఇచ్చిన మూలికల తాలూకు ట్యాబ్లెట్లు మనకు మార్కెట్‌లో లభిస్తాయి. వాటిని వైద్య సలహా మేరకు వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.