త్రిఫల చూర్ణం. ఇది ఒక ఆయుర్వేద ఔషధం. ఎంతో పురాతన కాలం నుంచి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో మూడు రకాల మూలికలు ఉంటాయి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ.. వీటిని ఎండబెట్టి పొడి చేసి సమాన భాగాల్లో కలిపి త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఒక్కటే చూర్ణం అయినప్పటికీ దీన్ని భిన్న రకాల సమస్యలకు అనేక విధాలుగా ఉపయోగించాల్సి ఉంటుంది. మరి అధిక బరువును తగ్గించుకునేందుకు త్రిఫల చూర్ణాన్ని నిత్యం ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
అధిక బరువును తగ్గించుకునేందుకు త్రిఫల చూర్ణాన్ని ఇలా ఉపయోగించాలి.
* ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల త్రిఫల చూర్ణం కలిపి రాత్రంతా ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ మిశ్రమాన్ని తాగాలి.
* రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ త్రిఫల చూర్ణం వేసి అందులో ఒక చిన్న దాల్చిన చెక్కను వేయాలి. రాత్రంతా ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే అందులో 1 టేబుల్ స్పూన్ తేనె వేసి ఆ మిశ్రమాన్ని పరగడుపునే తాగేయాలి.
* త్రిఫల చూర్ణంకు సంబంధించి ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో 1 ట్యాబ్లెట్ వేసుకోవాలి.
* ఒక కప్పు నీటిని తీసుకుని బాగా మరిగించి అందులో ఒక టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణం వేయాలి. తరువాత స్టవ్ ఆర్పి నీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. గోరు వెచ్చగా ఉండగా అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి.
ఇలా చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
గమనిక: త‌్రిఫల చూర్ణం వాడడం వల్ల కొందరికి విరేచనాలు అవుతాయి. అలాంటి వారు ఈ చూర్ణాన్ని వాడకూడదు. పైన తెలిపిన సూచనలను పాటించే ముందు వైద్య సలహా తీసుకుంటే మంచిది.