IPL 2022 : మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరును ఎవరికీ పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ధోనీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ధోనీ మైదానంలో బ్యాట్ లేదా గ్లోవ్స్.. దేంతో అడుగు పెట్టినా సరే.. స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగిపోతుంది. ఈలలు వేస్తూ ధోనీకి స్వాగతం పలుకుతారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ తప్పుకున్నా.. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే ధోనీకి ప్రస్తుతం 40 సంవత్సరాలు. దీంతో ధోనీ త్వరలోనే ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడనే వార్తలు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇక తాజాగా కొందరు నెటిజన్లు ఇదే విషయంపై అవమానకర వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ 2022 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ నెల 26వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతోంది. అందులో భాగంగానే ఐపీఎల్ జట్లన్నీ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశాయి. అయితే ముందుగా చెన్నై ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని సూరత్ వేదికగా చెన్నై తమ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆ సందర్భంగా చెన్నై కెప్టెన్ ధోనీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను ఆ టీమ్ విడుదల చేసింది.
అయితే వాటిల్లో ధోనీని చూసిన కొందరు నెటిజన్లు అవమానకర కామెంట్లు చేశారు. ధోనీ మునుపటిలా ఫిట్ గా లేడని.. శరీరం మారిపోయిందని.. 40 ఏళ్ల వయస్సులో ఇలాగే జరుగుతుంది.. అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆ కామెంట్లకు ధోనీ అభిమానులు స్పందించారు. 40 ఏళ్ల వయస్సులో ధోనీ బాగానే ఉన్నాడు, కానీ చూస్తున్న మీ కళ్లే బాగా లేవు కాబోలు, ఒకసారి చెక్ చేయించుకోండి.. అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్ కొనసాగుతోంది. ఇక ధోనీ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడడం లేదని అనుకున్నారు, కానీ ఈసారికి మాత్రం అతను ఆడుతాడని తెలుస్తోంది. 2023 ఐపీఎల్‌లో అతను ఆడేది అనుమానాస్పదంగానే మారింది.