Pudina Pachadi : పుదీనాను చాలా మంది రోజూ అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. పుదీనా ఆకులు తాజాదనపు రుచిని కలిగి ఉంటాయి. కనుకనే వీటిని అనేక ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయితే పుదీనాను పోపు పదార్థంగానే కాక.. దాంతో వంటకాలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా పుదీనాతో తయారు చేసే పుదీనా చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా ఆకులు – 2 లేదా 3 కప్పులు, నువ్వులు – 1/3 వ వంతు కప్పు, పచ్చి మిరపకాయలు – 10 లేదా 15, నూనె – తగినంత, టమాటాలు – 2, చింత పండు – కొద్దిగా, వెల్లుల్లి (పొట్టు తీసినవి) – 10, జీలకర్ర – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, ఆవాలు – అర టీస్పూన్, శనగ పప్పు – అర టీస్పూన్, మినప పప్పు – అర టీస్పూన్, ఎండు మిరపకాయలు – 2, ఇంగువ – కొద్దిగా, కరివేపాకు – కొద్దిగా, చితక్కొట్టిన వెల్లుల్లి – 3.
పుదీనా చట్నీ తయారు చేసే విధానం..
పుదీనా ఆకులను కాడలు లేకుండా తెంపి వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో నూనె తగినంత వేసి కాగాక అందులో పుదీనా ఆకులను వేసి వేయించాలి. నీరు పోయేదాకా వేయించిన తరువాత పుదీనాను తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు నువ్వులను తీసుకుని ఒక కళాయిలో వేసి బాగా వేపుకోవాలి. 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై వేయించితే నువ్వులు బాగా రోస్ట్ అవుతాయి. తరువాత వాటిని మిక్సీలో వేసి పొడిలా పట్టుకోవాలి. ఒక కళాయి తీసుకుని అందులో కాస్త నూనె వేసి కాగాక పచ్చి మిరపకాయలు వేసి బాగా వేయించాలి. తరువాత మిరపకాయలను తీసి మళ్లీ నూనె వేసి అందులో తరిగిన టమాటా ముక్కలు, చింతపండు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. వీటిని కూడా పక్కన పెట్టాలి. తరువాత మిక్సీలో ముందుగా ఫ్రై చేసి పెట్టిన పుదీనా ఆకులు, నువ్వుల పొడి, వేయించి పెట్టుకున్న పచ్చి మిరపకాయలు, టమాటా, చింత పండు మిశ్రమం, పొట్టు తీసిన వెల్లుల్లి, ఉప్పు.. అన్నింటినీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి స్పూన్‌తో కలియబెడుతుండాలి. దీంతో మిక్సీలో పచ్చడి బాగా తయారవుతుంది.
ఇక తరువాత ఒక కళాయి తీసుకుని అందులో కాస్త నూనె వేసి కాగిన తరువాత అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప పప్పు, ఎండు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు, చితక్కొట్టిన వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఇలా తయారైన పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసిన పచ్చడిలో వేసి బాగా కలపాలి. దీంతో ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ తయారవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు, దోశలలో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
పుదీనా ఆకుల వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. వేసవిలో మనకు పుదీనా ఆకులు చలువ చేస్తాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఇలా పుదీనా ఆకుల వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.