Coconut Laddu : పచ్చి కొబ్బరి.. బెల్లం.. ఇవి రెండూ అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చికొబ్బరి, బెల్లంలను అలాగే నేరుగా కలిపి తినేస్తుంటారు. అయితే వీటిని అలా కాకుండా లడ్డూ రూపంలో తయారు చేసి తింటే ఇంకా మేలు జరుగుతుంది. దీంతో రోజుకు ఒక లడ్డూను తిన్నా చాలు.. అమితమైన బలం కలుగుతుంది. మరి కొబ్బరి లడ్డూను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
కొబ్బరి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి – ఒకటిన్నర కొబ్బరి కాయ, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని.
కొబ్బరి లడ్డూ తయారీ విధానం..
ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి జార్ లో వేసి తురుములాగా పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బెల్లం తురుము వేసి పావు కప్పు నీటిని పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో కానీ, కళాయిలో కానీ బెల్లం కరిగించిన నీటిని పోసి, మధ్యస్థ మంటపై ముదురు తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటను తగ్గించి, ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి తురుమును, యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి, అడుగు మాడకుండా కలుపుతూ, 10 నిమిషాల పాటు బెల్లం పాకం దగ్గర పడేలా ఉడికించుకోవాలి. ఇందులో నుండి కొద్ది మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలా చేసి చూడాలి. ఈ లడ్డు సరిగ్గా వచ్చినట్లయితే ఈ మిశ్రమం తయారయినదిగా భావించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఒక వేళ ఈ మిశ్రమం బాగా ఉడికి గట్టిపడితే ఒక టీ స్పూన్ నీళ్లను పోసి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక చిన్న కళాయిలో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి డ్రైఫ్రూట్స్ ను వేయించి, ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతికి నెయ్యిని రాసుకుంటూ కావలసిన పరిమాణంలో లడ్డూలలా తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డూ తయారవుతుంది. ఈ విధంగా చేసుకున్న లడ్డూలు 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
ఇలా కొబ్బరి లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి చొప్పున తినాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనం అనంతరం ఒక లడ్డూను తినవచ్చు. లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలోనూ ఒక లడ్డూను తీసుకోవచ్చు. దీని వల్ల అనేక పోషకాలు మనకు లభిస్తాయి. అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. నీరసం, నిస్సత్తువ తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.