Raw Mango Juice : వేసవి కాలం రాగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చి మామిడి కాయలు. పచ్చి మామిడి కాయలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో పచ్చి మామిడి కాయలు ఎంతో సహాయపడతాయి. పచ్చి మామిడి కాయలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేసవి కాలంలో వచ్చే వ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో పచ్చి మామిడి కాయలు దోహదపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో పచ్చి మామిడి కాయలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని మనం ఎక్కువగా ముక్కలుగా చేసుకుని తింటూ ఉంటాం. పచ్చి మామిడి కాయను మనం జ్యూస్ గా చేసుకుని కూడా తాగవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే పచ్చి మామిడి కాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మామిడి కాయ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి మామిడి కాయ గుజ్జు – ఒక టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు – 15 నుండి 20, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, చక్కెర పొడి – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నీళ్లు – ఒకటిన్నర గ్లాసు, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్.
పచ్చి మామిడి కాయ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చి మామిడి కాయ గుజ్జు, పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, చక్కెర పొడి, ఉప్పు, నిమ్మరసం, అర గ్లాసు నీటిని పోసి మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న దానిని జల్లి గంటె లేదా శుభ్రమైన వస్త్రంలో వేసి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టగా వచ్చిన రసంలో మరో గ్లాసు నీటిని పోసి కలుపుకోవాలి. ఈ జ్యూస్ ను ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయిన తరువాత తాగితే చాలా రుచిగా ఉంటుంది.
పచ్చి మామిడి కాయల గుజ్జును మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పచ్చి మామిడి కాయను ముక్కలుగా చేసి ఒక గిన్నెలో కానీ, కుక్కర్ లో కానీ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. దీంతో పచ్చి మామిడి కాయ గుజ్జు తయారవుతుంది. ఇలా పచ్చి మామిడి కాయలతో గుజ్జు తయారు చేసి ఆ తరువాత దాంతో జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సీజన్‌లో తరచూ ఈ జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేసవి కాలంలో వచ్చే రోగాల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో నీరు త్వరగా పోకుండా ఉంటుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.