Bobbarlu Kura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల గింజలలో బొబ్బెర్లు ఒకటి. వీటితో చాలా మంది గారెలు, వడలు చేసుకుని తింటుంటారు. కానీ అవి నూనె వస్తువులు. కనుక మనకు అవి హాని కలగజేస్తాయి. అలా కాకుండా వాటిని ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవాలి. బొబ్బెర్లను మొలకలుగా చేసి తినవచ్చు. అయితే ఇవి కొందరికి రుచించవు. కనుక వాటిని కూరగా వండుకుని తినవచ్చు. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రెండూ లభిస్తాయి. ఇక బొబ్బెర్ల కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొబ్బెర్ల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
బొబ్బెర్లు – ఒక కప్పు, ఉల్లిపాయలు – ఒకటి, టమాటా – ఒకటి, ఆవాలు – ఒక టీస్పూన్, కరివేపాకు రెబ్బలు – రెండు, పసుపు – పావు టీస్పూన్, నూనె – రెండు పెద్ద టీస్పూన్లు, కొబ్బరి తురుము – అర కప్పు, నానబెట్టిన బియ్యం – టీస్పూన్, ధనియాలు – ఒకటిన్నర టీస్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, ఎండు మిర్చి – 5, చింతపండు గుజ్జు – ఒక టీస్పూన్, బెల్లం ముక్క – కొద్దిగా, ఉప్పు – తగినంత.
బొబ్బెర్ల కూర తయారు చేసే విధానం..
బొబ్బెర్లను మూడు గంటల వరకు నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్‌లోవేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కరివేపాకు కూడా వేయించుకుని పసుపు వేసి కలిపి మూత పెట్టి టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. ఈలోపు మసాలా పదార్థాలను అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా, బొబ్బర్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి. కూర దగ్గరకు అయినప్పుడు దింపేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే బొబ్బర్ల కూర తయారవుతుంది. దీన్ని చపాతీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. శరీరానికి పోషకాలు, ఆరోగ్యం, శక్తి అన్నీ లభిస్తాయి.