Frequent Urination : మన శరీరంలో జరిగే జీవక్రియలతోపాటు మనం తినే ఆహారాలు.. తాగే ద్రవాల కారణంగా మన శరీరంలో వ్యర్థాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ క్రమంలోనే మలం, చెమట, మూత్ర విసర్జన ద్వారా ఆ వ్యర్థాలు బయటకు పోతుంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇందుకు గాను మన శరీరం రోజుకు 24 గంటలూ శ్రమిస్తుంటుంది. అయితే కొందరికి మూత్రం ఎక్కువగా వస్తుంటుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. షుగర్ సమస్య అధికంగా ఉన్నవారికి మూత్రం ఎక్కువగా వస్తుంటుంది. కనుక మూత్రం ఎక్కువగా వస్తుంటే ముందుగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ ఉన్నట్లు తేలితే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది. అప్పుడు మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది.
2. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కూడా మూత్రం అధికంగా వస్తుంది. కనుక ఈ పరీక్షలు కూడా చేయించుకోవాలి. దీంతో సమస్య ఎక్కడ ఉంది ? అన్న విషయం స్పష్టమవుతుంది. తద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చు.
3. డైయురెటిక్స్‌కు చెందిన మెడిసిన్లను వాడేవారికి కూడా మూత్రం అధికంగా వస్తుంది. అలాగే నాడీ సంబంధ సమస్యలు ఉన్నా.. మూత్రాశయ వ్యవస్థలో ట్యూమర్లు ఉన్నా.. ఇలాగే మూత్ర విసర్జన అధికంగా అవుతుంటుంది.
4. మూత్రాశయం వాపులు ఉన్నా.. లైంగిక సంబంధ వ్యాధులు ఉన్నా.. ఇలాగే మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కనుక దీనికి సంబంధించిన అన్ని పరీక్షలను చేయించుకోవాలి. అప్పుడు సమస్య ఏమిటనేది తెలుస్తుంది. దీంతో సమస్యకు అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు. అప్పుడు కిడ్నీలు చెడిపోకుండా సురక్షితంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.