Sour Curd : మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాం. పెరుగు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగును తరుచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగులో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ వంటి మినరల్స్‌తోపాటు విటమిన్ బి2, విటమిన్ బి12 వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. పాల కంటే కూడా పెరుగు త్వరగా జీర్ణమవుతుంది. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.
పెరుగులో ఉండే పొటాషియం బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పెరుగును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే యోని ఇన్‌ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో పెరుగు ఎంతో దోహదపడుతుంది. పెరుగును తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. మెదడు పని తీరును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ పెరుగు ఉపయోగపడుతుంది.
రక్త హీనత సమస్యతో బాధ పడేవారు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. 100 గ్రా. ల పెరుగులో 59 క్యాలరీల శక్తి ఉంటుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడంలో పెరుగు ఎంతో సహాయపడతుంది. తాజా పెరుగును ఆహారంగా తీసుకోవడం కంటే పులిసిన పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి మేలు చేసే ఎసినోఫిలస్, లాక్టోబాసిలస్, బిఫిడో వంటి బాక్టీరియాలు పులిసిన పెరుగులోనే అధికంగా ఉంటాయి. ఇవి మన ప్రేగులల్లో ఎంత ఎక్కువగా ఉంటే మన శరీరానికి అంత ఎక్కువగా మేలు జరుగుతుంది.
పులిసిన పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరం ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటుంది. పులిసిన పెరుగును నేరుగా తినలేని వారు మజ్జిగ పులుసులా చేసుకుని తినవచ్చు. ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, చిన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలను, కరివేపాకు, పసుపును వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపుతోపాటు కొద్దిగా ఉప్పును కూడా పులిసిన పెరుగులో వేసి కలుపుకోవాలి. కనీసం వారానికి రెండు సార్లు ఇలా చేసుకుని పులిసిన పెరుగును తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.