Banana Lassi : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు అనేక మంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పదార్థాలు, పానీయాలను అధికంగా తీసుకుంటుంటారు. అయితే వేసవిలో మనకు మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు. మజ్జిగలో కాస్త చక్కెర వేస్తే అదే లస్సీ అవుతుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే ఇదే లస్సీలో కాస్త అరటి పండు గుజ్జును కలిపి బనానా లస్సీ చేసుకుని తాగితే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. పైగా వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. శక్తి లభిస్తుంది. దీంతోపాటు పోషకాలు కూడా అందుతాయి. ఇక అరటి పండు లస్సీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండు లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాగా పండిన అరటి పండ్ల గుజ్జు – 2 కప్పులు, పెరుగు – ఒక కప్పు, పాలు – పావు కప్పు, ఐస్ క్యూబ్స్ – 2, చక్కెర – 2 టేబుల్ స్పూన్లు.
అరటి పండు లస్సీని తయారు చేసే విధానం..
అరటి పండ్ల గుజ్జును తీసుకుని గరిటెతో తిప్పుతూ ఇంకా బాగా గుజ్జులా చేయాలి. పెరుగును బాగా చిలికి పలుచని మజ్జిగలా చేసుకోవాలి. అందుకు అవసరం అయినన్ని నీళ్లు కలపాలి. పాలను మరగబెట్టి చల్లార్చాలి. ఇక బ్లెండర్ తీసుకుని జార్‌లో అరటి పండ్ల గుజ్జు, మజ్జిగ, పాలు, ఐస్ క్యూబ్స్, చక్కెర వేసి అన్నింటినీ మిక్సీ పట్టాలి. దీంతో చిక్కని ద్రవం తయారవుతుంది. దీన్ని గ్లాస్‌లోకి తీసుకుంటే చాలు.. చల్ల చల్లని అరటి పండు లస్సీ తయారవుతుంది. ఇలా చేస్తే రెండు గ్లాసుల లస్సీ వస్తుంది. కనుక ఇద్దరు తాగవచ్చు. ఇంకా ఎక్కువ మంది ఉంటే అందుకు అనుగుణంగా పైన తెలిపిన పదార్థాలను కలుపుకోవాలి. దీంతో లస్సీ రుచిగా ఉంటుంది.
అయితే లస్సీ తయారు చేసే సమయంలో ఐస్ క్యూబ్స్ వద్దనుకుంటే.. లస్సీ తయారయ్యాక అందులో కాస్త నీళ్లు పోసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. 2 గంటల తరువాత తాగాలి. దీంతో ఐస్ క్యూబ్స్‌ను వాడాల్సిన పనిలేదు. ఇక చక్కెర వద్దనుకునేవారు అందులో తేనెను ఉపయోగించవచ్చు. దీంతో లస్సీ ఆరోగ్యవంతంగా మారుతుంది. ఈ లస్సీని తాగితే వేడి మొత్తం తగ్గడంతోపాటు.. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. కడుపులో మంట కూడా తగ్గుతుంది. అలాగే విరేనాలు తగ్గుతాయి. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు.