Ginger Storage : మనం వంటలను చేయడంలో అల్లాన్ని వాడుతూ ఉంటాం. అల్లం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లంతో మనం టీ లను, కషాయాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. తరచూ అల్లాన్ని వాడడం వల్ల అజీర్తి, ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గడంతోపాటు బరువు తగ్గడంలో, శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వు (ఎల్‌డిఎల్) స్థాయిలను తగ్గించడంలో కూడా అల్లం ఎంతో సహాయపడుతుంది.
అల్లాన్ని , వెల్లుల్లితో కలిపి పేస్ట్ లా చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. కొందరు టీ లను, కషాయాలను తయారు చేసుకోడానికి లేదా ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకుని లేదా కొందరు అల్లాన్ని నిల్వ చేసి ఎప్పటికప్పుడు పేస్ట్ లా చేసుకుని వాడుకుంటూ ఉంటారు. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు ఉండేలా ఎలా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అల్లాన్ని 5 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. తరువాత అల్లం మీద ఉండే మట్టి, మలినాలు అంతా పోయేలా శుభ్రంగా 4 నుండి 5 సార్లు నీళ్లతో కడగాలి. కొన్ని సార్లు అల్లం మీద నల్లని మచ్చలు ఉంటాయి. కత్తి సహాయంతో నల్లని మచ్చలు ఉండే భాగాన్ని తీసివేయాలి. ఇలా చేసుకున్న అల్లాన్ని వస్త్రం సహాయంతో తడి లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు అల్లాన్ని 2 లేదా 3 టిష్యూ పేపర్ లలో చుట్టి పై నుండి మళ్లీ న్యూస్ పేపర్ లో చుట్టి పాలీథిన్ కవర్ లో లేదా జిప్ లాక్ బ్యాగ్ లో ఉంచి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి.
టిష్యూ పేపర్ అందుబాటులో లేని వారు రెండు న్యూస్ పేపర్ లలో వేసి చుట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా అల్లాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.