Dates Kheer : ఖర్జూరాలను ఎంతో మంది ఆసక్తిగా తింటుంటారు. ఇవి పండ్లు. సహజసిద్ధమైనవి. కనుక వీటిల్లో ఉండే చక్కెరలు మనకు హాని చేయవు. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటే వీటిని రోజుకు 2-3 తినవచ్చు. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి. అలాగే మలబద్దకం, గ్యాస్, అజీర్ణం.. వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దీంతోపాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక వీటిని తింటే రక్తం బాగా తయారవుతుంది. రక్త హీనత తగ్గుతుంది. అయితే ఖర్జూరాలను నేరుగా తినాల్సిన పనిలేదు. వీటితో ఎంతో రుచికరమైన పాయసం తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. దీని వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఖర్జూరాలతో పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరాలతో పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఖర్జూరాలు (విత్తనాలు తీసినవి) – అర కప్పు, నల్ల ఎండు ద్రాక్ష – అర కప్పు, గసగసాలు – పావు కప్పు, బెల్లం – ముప్పావు కప్పు, నెయ్యి – రెండు టీస్పూన్లు, డ్రై ఫ్రూట్స్ – అర కప్పు, కొబ్బరి పాలు – పావు లీటర్, బియ్యం పిండి – రెండు టీస్పూన్లు.
ఖర్జూరాల పాయసం తయారు చేసే విధానం..
స్టవ్‌పై ఒక పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, గసగసాలు, ఖర్జూరాలు, నల్ల ఎండు ద్రాక్షలను వేయించుకోవాలి. తరువాత స్టవ్‌ని చిన్న మంటపై పెట్టి అందులో బెల్లం, కొబ్బరిపాలు పోసి కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్‌లో బియ్యం పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలియబెట్టుకుని ఈ మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్ మిశ్రమంలో పోయాలి. 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికితే ఖర్జూరాల పాయసం రెడీ అయినట్లే. దీన్ని వేడిగా లేదా చల్లగా కూడా తీసుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే గంటపాటు ఫ్రిజ్‌లో పెడితే చాలు. దీంతో రుచికరమైన ఖర్జూరాల పాయసం రుచిని ఆస్వాదించవచ్చు. దీని వల్ల పోషకాలు, శక్తి, ఆరోగ్యం లభిస్తాయి.