Itching In Groin : మనలో కొందరు గజ్జలల్లో, పిరుదుల మధ్య దురదలతో బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రదేశాలలో దురదలు వచ్చినప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఫంగస్ ఇన్ ఫెక్షన్ ల కారణంగా వచ్చే ఈ దురదలను తగ్గించడానికి చేత్తో గోకుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో చర్మం రంగు మారడం, చర్మం గట్టిగా అవ్వడం వంటివి జరుగుతాయి.ఈ ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ సన్నగా ఉండే వారిలో కంటే లావుగా ఉండే వారిలోనే అధికంగా వస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది లావుగా ఉంటున్నారు. వీరిలో తొడలు లావుగా ఉండి గజ్జల్లో చెమట అధికంగా వస్తుంటుంది. ఈ చెమటకు గాలిలో ఉండే ఫంగస్ చేరి ఇన్ ఫెక్షన్స్ ను కలిగిస్తాయి.
ప్రస్తుత కాలంలో ధరించే బిగుతూ దుస్తులు కూడా ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ రావడానికి మరో కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి వాటిని ధరించడం వల్ల గాలి తగలక పోవడం, చర్మం రాపిడికి గురవ్వడం వంటి వాటిని కూడా మనం చూడవచ్చు. ఈ సమస్య నుండి బయట పడడానికి క్రీములను, ఆయింట్ మెంట్ లను వాడుతూ ఉంటారు. ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ ను సహజ సిద్దమైన పద్దతిలో తగ్గించుకోవచ్చు. వేప ఆకులను తీసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపును వేసి కలిపి చంకలు, పిరుదుల మధ్య భాగం, గజ్జలలో రాసుకుని వదులుగా ఉండే దుస్తులను ధరించి ఒక గంట పాటు ఉండాలి. తరువాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఇన్ ఫెక్షన్స్ తగ్గుతాయి.
వేప ఆకులకు బదులుగా వేప నూనెను కూడా మనం వాడవచ్చు. వేప ఆకుల పేస్ట్ ను రాయడం కంటే వేప నూనెను రాయడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది. ఇలా రాసిన తరువాత స్నానం చేసి ఆ ప్రాంతాలలో తడి లేకుండా చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు తేనెను రాసుకుని పడుకోవడం వల్ల ఆ ప్రాంతంలో చర్మం రంగు మారి తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. గజ్జలు, పిరుదుల మధ్య భాగం, చంకలు.. వంటి భాగాలలో చెమట రాకుండా ఉండడానికి చాలా మంది పౌడర్ లను వాడుతూ ఉంటారు. పౌడర్ ఎక్కువ సమయం ఉండదు. కనుక ఆ ప్రాంతాలలో కొబ్బరి నూనెను రాయాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టకుండా ఉండడమే కాకుండా ఇన్ ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. దురదల సమస్యలు లేని వారు కూడా ఇలా కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల భవిష్యత్తులో దురదలు రాకుండా, చర్మం రాపిడికి గురి అవ్వకుండా ఉంటుంది. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.