Sleep Position : మనలో చాలా మంది రకరకాల భంగిమలల్లో నిద్రిస్తూ ఉంటారు. చాలా మంది పడుకునేటప్పుడు మాములుగా నిద్రించినా గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత ఏ భంగిమలో నిద్రించారో వారికే తెలియకుండా నిద్రపోతూ ఉంటారు. సరైన భంగిమలలో నిద్రించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. సరైన బరువు ఉండి, ఆరోగ్యకరంగా ఉండే వారు శవాసనంలా నిద్రించడం వల్ల మేలు కలుగుతుంది.
ఊబకాయం, పొట్ట భాగం లావుగా ఉన్న వారు శవాసనం వేసినట్లు నిద్రించడం వల్ల ఊపిరి అందక పోవడమే కాకుండా గురక ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని, ఊబకాయంతో బాధపడే వారు శవాసనంను పోలిన విధంగా నిద్రించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నడుము నొప్పి, సయాటిక్ నొప్పులు ఉన్న వారు పడుకునేటప్పుడు మోకాళ్ల కింద గుండ్రటి దిండును ఉంచుకుని వెల్లకిలా నిద్రించడం వల్ల వెన్నెముక సరిగ్గా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ చురుకుగా ఉండి నొప్పులు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.
మోకాళ్ల వాపులు, వెరికోన్స్ వీన్స్ ఉన్న వారు పాదాల కింద దిండును ఉంచుకుని వెల్లకిలా నిద్రించడం వల్ల ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్లలో ఉండే నీరు, వెరికోన్స్ వీన్స్ వల్ల పేరుకు పోయిన రక్తం కిందికి సులువుగా ప్రవహించడం వల్ల నొప్పులు, మంటలు తగ్గుతాయి. మనలో చాలా మంది ఎడమ చేతిని తల కింద పెట్టుకుని ఒక పక్కకు తిరిగి నిద్రిస్తూ ఉంటారు. ఇలా ఎడమ వైపు తిరిగి పడుకోవడం అన్ని భంగిమల కంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, పొట్ట భాగం అధికంగా ఉండే వారు, గురక సమస్య అధికంగా ఉన్న వారు ఇలా నిద్రించడం వల్ల పొట్ట బరువు ఊపిరితిత్తుల మీద ఎక్కువగా పడకుండా ఉంటుంది. ఇలా ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవడం వల్ల ఊపిరి బాగా ఆడి గురక ఎక్కువగా రాకుండా ఉంటుంది.
వెల్లకిలా పడుకోవడం వల్ల కొందరిలో నడుము నొప్పి, మెడ నొప్పిని మనం గమనించవచ్చు. అలాంటి వారు ఎడమ వైపునకు తిరిగి నిద్రించడం వల్ల మెడ నొప్పి, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల కాలేయం మీద కూడా బరువు పడకుండా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు మాత్రం ఇలా ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబందిత సమస్యలు ఉన్న వారు కుడి చేతి వైపు తిరిగి పడుకోవడం మంచిది. ఇలా పడుకోవడం వల్ల గుండె మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది.
కొందరు పొట్ట భాగం పూర్తిగా మంచానికి అనేలా బోర్లా పడుకుంటారు. ఇలా పడుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా నిద్రించడం వల్ల పొట్ట బరువు అంతా ఊపిరితిత్తుల మీద పడి ఊపిరి సరిగ్గా అందక ఆక్సిజన్ శాతం తగ్గి ఆయాసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా పడుకోవడం వల్ల ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవ్వదని.. ఇలా పడుకోవడం శరీరానికి మంచిది కాదని.. నిపుణులు చెబుతున్నారు. మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్న వారు పురుపుల మీద పడుకోవడం కంటే నేల మీద, బొంతమీద పడుకోవడం మంచిదని.. అలాగే తక్కువ ఎత్తులో ఉండే దిండును మాత్రమే ఉపయోగించాలని.. లేదా దిండును పూర్తిగా ఉపయోగించక పోవడమే మంచిదని, ఇలా చేయడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని వారు చెబుతున్నారు.