Egg Fried Rice : మనం బాస్మతి బియ్యాన్ని ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఎక్కువగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తయారీలో మనం బాస్మతి బియ్యాన్ని వాడుతూ ఉంటాం. బాస్మతి బియ్యంతో తయారు చేసే ఫ్రైడ్ రైస్ లలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఇది బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దీనిని ఇంట్లో కూడా అంతే రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇక ఎగ్ ప్రైడ్ రైస్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – పావు కిలో, కోడిగుడ్లు – 3, తరిగిన అల్లం వెల్లుల్లి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన క్యాప్సికం – 1, తరిగిన ఉల్లిపాయ – 1, క్యాబేజ్ తురుము – ఒక కప్పు, తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, నూనె – నాలుగు టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – అర టేబుల్ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టేబుల్ స్పూన్, సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ – ఒక టేబుల్ స్పూన్.
ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి తగినన్ని నీళ్లను పోసి 95 శాతం ఉడికించుకోవాలి. తరువాత ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక కోడిగుడ్లను పగలకొట్టి వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి మధ్యస్థ మంటపై తరిగిన క్యాప్సికం, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజ్ తురుము వేసి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
తరువాత ఉడికించుకున్న బాస్మతి బియాన్ని వేసి కలుపుకోవాలి. తరువాత కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత పోయా సాస్, వెనిగర్ వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు పెద్ద మంటపై నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. 4 నిమిషాల తరువాత స్టవ్ ఆప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల బయట దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ రుచి ఉండేలా మనం ఇంట్లోనూ ఈ రైస్‌ను తయారు చేసుకోవచ్చు. బాస్మతి బియ్యం అందుబాటులో లేని వారు సాధారణ బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. దీంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంతో రుచిగా తయారవుతుంది.