నేడు స్మార్ట్‌ఫోన్లను కొనేవారు వాటిలో చూస్తున్న ప్రధానమైన ఫీచర్ కెమెరా. బ్యాక్ కెమెరాయే కాదు, సెల్ఫీ కెమెరా కూడా నాణ్యంగా ఉంటేనే అలాంటి ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ తయారీ సంస్థలు తాము యూజర్లకు అందిస్తున్న ఫోన్లలో అద్భుతమైన క్వాలిటీ కలిగిన కెమెరాలను అందిస్తున్నాయి. అయితే ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా కెమెరా సెన్సార్ సామర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే అది అంత మంచి ప్రదర్శన ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. అది కరెక్టే, కాకపోతే కెమెరా సెన్సార్ పిక్సల్స్‌తోపాటు దానికి ఉండే ఎఫ్ నంబర్ ను కూడా ఓ సారి పరిశీలించాలి. అప్పుడే ఆ ఫోన్ కెమెరా ఎంత సమర్థవంతంగా ఉంటుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఎఫ్ నంబర్ అంటే ఏమిటి..? ఫోన్‌కు ఉండే ఫీచర్లలో ఎఫ్ నంబర్‌ను ఎలా గుర్తించాలి..? అంటే… దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫోన్ ఫీచర్లలో మీరెప్పుడైనా కెమెరా స్పెసిఫెకేషన్లతోపాటు ఉండే f/2.2, f/3, f/4 వంటి నంబర్లను గమనించారా..? దాన్నే f నంబర్ అంటారు. f నంబర్ అంటే ఫోకల్ రేషియో, ఎఫ్ రేషియో, ఎఫ్ స్టాప్, ఎఫ్ అపర్చర్ అని అర్థాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఎఫ్ నంబర్‌లో ఎఫ్ కింద ఉండే అంకె ఎంత తక్కువగా ఉంటే కెమెరా అంత నాణ్యమైన ఫొటోలను ఇస్తుంది. అంటే నంబర్ ఎంత తక్కువ ఉంటే ఆ కెమెరా లెన్స్ అంత వెడల్పుగా ఉంటాయన్నమాట. అప్పుడు పెద్ద మొత్తంలో కాంతి ఆ లెన్స్ గుండా ప్రసారమవుతుంది. దీంతో మరింత ప్రకాశవంతమైన ఫొటోలు, వీడియోలు వస్తాయి. ఈ క్రమంలో పరిసరాల్లో కాంతి అంత లేకున్నా లో లైట్ లోనూ ఫొటోలు, వీడియోలను బ్రహ్మాండంగా తీసుకోవచ్చన్నమాట.
ప్రస్తుతం చాలా సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు బ్యాక్ కెమెరాతోపాటు సెల్ఫీ కెమెరాను కూడా నాణ్యంగా తీర్చిదిద్దుతున్నాయి. చాలా ఫోన్ల ద్వారా లో లైట్‌లోనూ ఫొటోలు, వీడియోలు తీసుకునే సౌకర్యం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. అందుకు పైన చెప్పిన ఎఫ్ నంబరే కారణం. ఈ క్రమంలో ఎవరైనా స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు ఇకపై పైన చెప్పిన విధంగా f నంబర్‌ను ఓ సారి పరిశీలించి మరీ ఆ ఫోన్‌ను కొనండి. దాంతో మీకు అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు లభిస్తాయి.