Beetroot Fry : పింక్ రంగులో ఉండే కూరగాయ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బీట్ రూట్. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని సలాడ్స్ రూపంలో, జ్యూస్ లా చేసుకుని తీసుకోవచ్చు. బీట్ రూట్ తో ఫ్రై ని కూడా చేయవచ్చు. నేరుగా బీట్‌రూట్‌ను తినడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటి వారు బీట్‌రూట్ ఫ్రై చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు లభిస్తాయి. ఇక బీట్‌రూట్‌తో ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బీట్ రూట్ – 4 (మధ్యస్థంగా ఉన్నవి), జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, సాంబార్ పొడి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
బీట్ రూట్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బీట్ రూట్ పై ఉండే చెక్కును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత బీట్ రూట్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప పప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక బీట్ రూట్ ను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత ధనియాల పొడి, సాంబార్ పొడి వేసి కలిపి పూర్తిగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ ఫ్రై తయారవుతుంది. అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి దీనిని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
బీట్ రూట్ ను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బీట్ రూట్ లో ప్లొటేట్ అధికంగా ఉంటుంది. రక్త నాళాలు దెబ్బ తినకుండా చేయడంలో ప్లొటేట్ ఎంతగానో సహాయ పడుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు, హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బీట్ రూట్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత సమస్యను తగ్గించడంలో బీట్ రూట్ ఎంతగానో సహాయపడుతుంది.