Chamadumpala Pulusu : మనం అనేక రకాల దుంపలను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. తినడానికి వీలుగా ఉండే దుంప జాతికి చెందిన వాటిల్లో చామ దుంప ఒకటి. ఇది కొద్దిగా జిగురుగా ఉంటుంది. చామ దుంపలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. చామ దుంపలతో మనం వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా చామ దుంపలతో పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చామ దుంప పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చామ దుంపలు – పావు కిలో, తరిగిన ఉల్లిపాయ – 1 (మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన టమాటాలు – రెండు (మధ్యస్థంగా ఉన్నవి), ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 30 గ్రా., కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, నూనె – 4 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – తగినన్ని.
చామ దుంపల పులుసు తయారీ విధానం..
ముందుగా చామ దుంపలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పసుపును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించిన తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత కారం పొడి, ధనియాల పొడి, ఉప్పును వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న చామదుంప ముక్కలు, చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించి, చివరిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చామ దుంప పులుసు కూర తయారవుతుంది. దీనిని అన్నం, రాగి సంగటి వంటి వాటితో కలిపి తింటే రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
తరచూ చామ దుంపలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు, పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో కూడా చామ దుంపలు ఉపయోగపడతాయి.