Carrot Fry : కంటిచూపును మెరుగుపరిచే ఆహార పదార్థాలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది క్యారెట్. క్యారెట్ ను నేరుగా తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా కూడా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. క్యారెట్ లో పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, మాంగనీస్ వంటి ఖనిజాలతోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి.
ఇక క్యారెట్ ను వివిధ ఆహార పదార్థాల తయారీలో వాడుతూ ఉంటాం. క్యారెట్ తో కూరలను, పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు. క్యారెట్ తో చేసే కూరలలో క్యారెట్ వేపుడు కూడా ఒకటి. క్యారెట్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా సులువుగా , రుచిగా క్యారెట్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – అర కిలో, వేయించిన పల్లీలు – ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 10, ఉప్పు – రుచికి తగినంత, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెబ్బలు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యారెట్ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత కచ్చా పచ్చాగా చేసిన నాలుగు వెల్లుల్లి రెబ్బలను, ఆవాలను, జీలకర్రను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత క్యారెట్ ముక్కలను వేసి కలిపి మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 నిమిషాల పాటు ఉడికించాలి. 3 నిమిషాల తరువాత మూత తీసి ఒకసారి కలపాలి. ఇప్పుడు పసుపును వేసి కలిపి మళ్లీ మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల కారాన్ని వేసి కలిపి మూత పెట్టి క్యారెట్ పూర్తిగా ఉడికే వరకు ఉంచి, చివరిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన, రుచిగా ఉండే క్యారెట్ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడంతోపాటు శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.
క్యారెట్ వేపుడును ఈ విధంగా చేయడం వల్ల క్యారెట్ లో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. నేరుగా క్యారెట్ ను తినలేని వారు ఇలా వేపుడుగా చేసుకుని తినవచ్చు. క్యారెట్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మూత్రపిండాల పని తీరు మెరుగుపడుతుంది. దంతాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువ, తక్కువ కాకుండా సమ స్థితిలో శరీరాన్ని ఉంచడంలోనూ క్యారెట్ ఉపయోగపడుతుంది.