Sneeze : ప్రస్తుత కాలంలో చాలా మంది తరుచూ వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడుతున్నారు. ఈ ఇన్ ఫెక్షన్ ల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. ఇన్ ఫెక్షన్ ల బారిన పడిన తరువాత మందులను మింగడానికి బదులుగా ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడమే కాకుండా మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించి మన శరీరానికి మేలు చేసే దినుసులల్లో జీలకర్ర కూడా ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే.
మనం వంటలలో ప్రతి రోజూ జీలకర్రను ఉపయోగిస్తూనే ఉంటాం. జీలకర్రను నేరుగా వాడడం కంటే జీలకర్రతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరం, జలుబు, కఫం, వాతం, పైత్యం, మేహ పైత్యం, రక్త పైత్యం, తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రతి రోజూ జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల మగవారిలో వీర్య కణాల సంఖ్య వృద్ది చెందుతుంది. బాలింతలలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అతిసారం, విరేచనాలు తగ్గుతాయి. రక్తంలో ఉండే తీవ్రమైన వేడి తగ్గుతుంది.
ఉదయం పూట పరగడుపున జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్తి , మలబద్దకం, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధమైన సమస్యలను నయం చేయడంలో జీలకర్ర కషాయం ఎంతో సహాయపడుతుంది. వాతావరణంలో కాలుష్యం కారణంగా తరచూ దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడే వారు జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల వీటి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
చాలా మందిలో ఉదయం పూట గొంతులో కఫం, శ్లేష్మం పేరుకు పోయినట్టుగా ఉండడం, తుమ్ములు రావడం, ముక్కు నుండి నీరు కారడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారు జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
జీలకర్ర కషాయాన్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. రెండు గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి ఒక గ్లాసు నీరు అయ్యే దాక మరిగించి వడకట్టుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రక్తం శుభ్రపడుతుంది. గొంతు బొంగురు పోవడం, గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్స్ వంటి వాటిని నయం చేయడంలోనూ జీలకర్ర కషాయం ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.