Biyyam Pindi Vadalu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడూ వడలను కూడా తయారు చేస్తూ ఉంటాం. వడల రుచి మనందరికీ తెలిసిందే. వడల తయారీకి మనం ఎక్కువగా మినప పప్పును వాడుతూ ఉంటాం. మినప పప్పును నానబెట్టి మిక్సీ పట్టి వడలను తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. మన ఇంట్లో బియ్యం పిండి ఉండాలే కానీ చాలా తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా ఉండే వడలను తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండితో వడలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, పెరుగు – ఒక కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, తరిగిన కరివేపాకు – రెండు రెబ్బలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
బియ్యం పిండి వడల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లను పోయాలి. ఈ నీటిలోనే బియ్యం పిండి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిని కూడా వేసి మధ్యస్థ మంటపై కలుపుతూ పిండి ముద్దగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుంటూ కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని వడల ఆకారంలో చేసుకోవాలి. ఇలా అన్ని వడలు చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి కాగిన తరువాత వడలను వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి వడలు తయారవుతాయి. తరచూ చేసుకునే మినప పప్పు వడలకు బదులుగా ఇలా బియ్యం పిండితో కూడా వడలను చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో, చాలా రుచిగా ఇలా బియ్యం పిండితో వడలను చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.