Alu Manchurian : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బంగాళాదుంపలు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే వంటకాలలో ఆలూ మంచూరియా కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా బయట దొరుకుతూ ఉంటుంది. బయట దొరికే విధంగా ఉండే ఆలూ మంచూరియాను మనం ఇంట్లోనే చాలా రుచిగా, చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ ఆలూ మంచూరియాను ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మంచూరియా తయారీకి కావల్సిన పదార్థాలు..
బేబీ పొటాటోస్ – 300 గ్రా., కార్న్ ఫ్లోర్ – మూడున్నర టేబుల్ స్పూన్స్, ఉప్పు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – చిటికెడు, నూనె – 5 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 2, నీళ్లు – తగినన్ని, సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ – ఒక టేబుల్ స్పూన్, టమాట కెచప్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ మంచూరియా తయారీ విధానం..
ముందుగా బేబీపొటాటోస్ ను కుక్కర్ లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తరువాత పొట్టు తీసి గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ను, పావు టీ స్పూన్ ఉప్పును, అర టీ స్పూన్ కారాన్ని, మిరియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన బేబీ పొటాటోస్ కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కాగిన తరువాత కార్న్ ఫ్లోర్ వేసి కలిపి ఉంచిన బేబీ పొటాటోస్ ను వేసి తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు మరో గిన్నెలో మిగిలిన కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత సోయా సాస్, వెనిగర్, టమాట కెచప్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉండలు లేకుండా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో మరి కొన్ని నీళ్లను కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వేయించుకున్న బేబీ పొటాటోస్ ను వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉంచి చివరగా కొత్తిమీరను వేస స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ ఆలూ మంచురియా తయారవుతుంది. దీనిని నేరుగా లేదా టమాట కెచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.