Mutton Bones Soup : మనం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్పుత్తులలో మటన్ కూడా ఒకటి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటుంటారు. మటన్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మటన్ నే కాకుండా మటన్ బోన్స్ ను కూడా సూప్ గా చేసుకుని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మటన్ బోన్ సూప్ ను తాగడం వల్ల మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
మటన్ బోన్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకు రెస్టారెంట్ లలో ఎక్కువగా దొరుకుతుంది. మనం ఇంట్లో కూడా చాలా సులువుగా మటన్ బోన్ సూప్ ను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ బోన్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ బోన్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ బోన్స్ – అర కిలో, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చి మిర్చి – 3, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – అర కప్పు, పుదీనా ఆకులు – అర కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 5 కప్పులు, జొన్న పిండి – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన ఉల్లి కాడలు – కొద్దిగా.
మసాలా దినుసులు..
బిర్యానీ ఆకు – 2, మిరియాలు – 10, లవంగాలు – 6, దాల్చిన చెక్క ముక్కలు – 3, యాలకులు – 4, సాజీరా – ఒక టీ స్పూన్.
మటన్ బోన్ సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో నూనె వేసి నూనె వేడయ్యాక మసాలా దినుసులను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలను, పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత మటన్ బోన్స్ వేసి కలిపి మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, పుదీనా ఆకులు, కొత్తిమీరను వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకుని అందులో తగినన్ని నీళ్లను పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మటన్ బోన్స్ ను 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తరువాత మూత తీసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న జొన్నపిండి వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోనే మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. చివరగా ఉల్లికాడలను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ బోన్ సూప్ తయారవుతుంది. దీనిని నేరుగా తాగవచ్చు. లేదా అన్నం, చపాతీ, బ్రెడ్ వంటి వాటితో కలిపి కూడా తీసుకోవచ్చు.
మటన్ బోన్ సూప్ ను తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడంలోనూ ఈ సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో మటన్ బోన్ సూప్ సహాయపడుతుంది. దీనిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల జుట్టు, చర్మం, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మటన్ బోన్ సూప్ ను తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.