Talambrala Mokka : మన చుట్టూ అందంగా పువ్వులు పూసే ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. పూలు పూసినప్పటికీ కొన్ని మొక్కలను మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్కలలో తలంబ్రాల మొక్క ఒకటి. దీనిని అత్తా కోడళ్ల మొక్క, గాజు కంప, గాజు పొద అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క పూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఈ మొక్క పూలు పూస్తుంది. తలంబ్రాల మొక్క పూలు చూడడానికి అందంగా ఉండడంతోపాటు సువాసనను కూడా వెదజల్లుతాయి.
ఈ మొక్క పండ్లను చాలా మంది తింటూ ఉంటారు. ఈ మొక్క తీగలతో బుట్టలను కూడా అల్లుతుంటారు. రైతులు చాలామంది ఈ మొక్కను పంట పొలాల చుట్టూ కంచెలా పెంచుతారు. ఇవి గుబురుగా ఉంటాయి కనుక పంట పొలాల్లోకి పశువులు రాకుండా ఉంటాయి. తలంబ్రాల మొక్క అందమైన పువ్వులను కలిగి ఉండడమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ మొక్కను ఉపయోగించి ఎన్నో రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల రసానికి పాము విషాన్ని హరించే శక్తి కూడా ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకుల నుంచి రసాన్ని తీసి గాయాలపై రాసి దంచిన ఆకులను గాయాలపై ఉంచి కట్టుగా కట్టడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ రసాన్ని చర్మంపై రాసుకోవడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. ఆ మొక్క కొమ్మలను తీసుకుని వచ్చి కొద్దిగా ఎండలో ఎండబెట్టి సాయంత్రం పూట ఇంట్లో కాల్చడం వల్ల ఇంట్లో నుండి దోమలు బయటకు వెళ్లిపోతాయి. శ్వాస సంబంధమైన సమస్యలను తగ్గించడంలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులను కచ్చా పచ్చాగా దంచి నీటిలో వేసి వీటితోపాటు మిరియాలను కూడా వేసి బాగా మరిగించి ఆ నీటితో ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుతాయి.
కీళ్ల నొప్పులను తగ్గించే గుణం కూడా ఈ మొక్కకు ఉంది. ఆ మొక్క ఆకులకు ఆముదాన్ని రాసి దోరగా వేడి చేయాలి. ఒక నూలు వస్త్రాన్ని తీసుకుని దానిని కూడా ఆముదంలో నూనెలో ముంచి గట్టిగా పిండి ఆ వస్త్రంలో ముందుగా వేడి చేసిన తలంబ్రాల ఆకులను ఉంచి గట్టిగా కట్టు కట్టడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.ఈ విధంగా తలంబ్రాల మొక్కను ఉపయోగించి మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.