Mushroom Pakoda : మనం ఆహారంగా అప్పుడప్పుడూ పుట్టగొడులను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పుట్టగొడుగులలో విటమిన్ బి2, విటమిన్ బి3, బిటమిన్ డి లు అధికంగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక ఆరోగ్యంగా బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పుట్ట గొడుగులను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త హీనత సమస్య తగ్గుతుంది. బీపీ, షుగర్ వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. పుట్ట గొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా ఎక్కడపడితే అక్కడ ఇవి మనకు లభ్యమవుతున్నాయి. చాలా మంది వీటిని కూరగా చేసుకుని తింటూ ఉంటారు. వివిధ రకాల వంటల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఇవే కాకుండా పుట్టగొడుగులతో ఎంతో రుచిగా ఉండే పకోడీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పకోడీలను తయారు చేయడం కూడా చాలా సులభమే. పుట్ట గొడుగులతో పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టగొడుగుల పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ముక్కలుగా చేసిన పుట్టగొడుగులు – 100 గ్రా., బియ్యం పిండి – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – అర కప్పు, శనగపిండి – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, టేస్టింగ్ సాల్ట్ – పావు టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, నీళ్లు – తగినన్ని.
పుట్టగొడుగుల పకోడీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పుట్టగొడుగులు, నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత పుట్టగొడుగుల ముక్కలను వేసి తగినన్ని నీళ్లను పోసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పుట్టగొడుగులను పకోడీలలా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుట్టగొడుగుల పకోడీలు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా టమాట కెచప్ తో కలిపి తింటే చాలా రుచిగి ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. సాయంత్రం సమయాలలో బయట దొరికే చిరు తిళ్లను తినడానికి బదులుగా ఇలా పుట్టగొడుగుల పకోడీలను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.