Coriander Leaves : మనం వంటల తయారీలో కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటాం. మనం చేసే వంటలను గార్నిష్ చేయడానికే మనం ఎక్కువగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటాం. అప్పుడప్పుడూ ఈ కొత్తిమీరతో పచ్చడిని కానీ, రైస్ ను కానీ తయారు చేస్తూ ఉంటాం. కొత్తిమీర కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో కూడా శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, చర్మాన్ని సంరక్షించడంలో కూడా కొత్తిమీర సహాయపడుతుంది. కొందరు కొత్తిమీరను వారానికి సరిపడా ఒకేసారి కొనుగోలు చేస్తూ ఉంటారు లేదా కొత్తిమీర ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ చేసుకున్న కొత్తిమీర ఆకులు పండిపోవడం, పాడవడం వంటివి కూడా జరుగుతూ ఉంటుంది. మనం కొత్తిమీరను నిల్వ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొత్తిమీర పాడవకుండా రెండు నుండి మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది. కొత్తిమీర పాడవకుండా ఎలా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం కొత్తిమీరను కొనుగోలు చేసేటప్పుడు లేతగా, తాజాగా ఉన్న దానిని మాత్రమే కొనుగోలు చేయాలి. ఇలా కొనుగోలు చేసిన కొత్తిమీర నుండి వేర్లను, పాడపోయిన ఆకులను, పండిన ఆకులను తీసేయాలి. ఇలా తీసివేయగా మిగిలిన కొత్తిమీరను చల్లటి నీటిలో వేసి కడిగి ఒక పొడి వస్త్రంపై ఉంచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూత ఉండే డబ్బాలో టిష్యూ పేపర్ ను ఉంచి అందులో ఆరబెట్టుకున్న కొత్తిమీరను ఉంచి దానిపై నుండి మరో టిష్యూ పేపర్ ను ఉంచి మూత పెట్టి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర పాడవకుండా రెండు నుండి మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది. కొత్తిమీరను వంటల తయారీలో వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా మేలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, మూత్రపిండాలను శుభ్రపరచడంలో, రక్త హీనత సమస్యను తగ్గించడంలో కూడా కొత్తిమీర ఉపయోగపడుతుంది.