Sesame Chikki : మనం వంటల తయారీలో నువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం. మనం చేసే కూరలు, పులుసులు చిక్కగా ఉండడానికి మనం నువ్వుల పొడిని వాడుతూ ఉంటాం. అలాగే నువ్వులతో నేరుగా తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
నువ్వులను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత కాల్షియం లభిస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా ఉంటాయి. నువ్వులతో చేసే తీపి పదార్థాలలో నువ్వుల చిక్కి కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. నువ్వుల చిక్కిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. నువ్వుల చిక్కిని ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల చిక్కి తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, యాలకులపొడి – కొద్దిగా.
నువ్వుల చిక్కి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నువ్వులను వేసి చిన్న మంటపై దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పంచదారను వేసి చిన్న మంటపై పంచదార పూర్తిగా కరిగి పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యిని రాసి పక్కన పెట్టుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి పాకం వచ్చిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి చిన్న మంటపై 2 నిమిషాల పాటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లో వేసి వీలైనంత పలుచగా చేసుకోవాలి. నువ్వుల మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత కత్తితో కావల్సిన పరిమాణంలో గాట్లు పెట్టి పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా చేసి మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నువ్వుల చిక్కిలు పది నుండి పదిహేను రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి.