Green Peas Pulao : మనం ఆహారంగా తీసుకునే వాటిలో పచ్చి బఠాణీలు కూడా ఒకటి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి బఠాణీలలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవే కాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా జీర్ణ శక్తిని, కంటి చూపును మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇవి ఎంతగానో ఉపచయోగపడతాయి.
వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. అయితే వీటిని మనం ఎక్కువగా వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ విధంగానే కాకుండా పచ్చి బఠాణీలతో మనం ఎంతో రుచిగా ఉండే ఉండే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. పచ్చి బఠాణీలతో పులావ్ ను ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బఠాణీ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి బఠాణీ – 200 గ్రా., నానబెట్టిన బాస్మతి బియ్యం – పావు కిలో, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడి పప్పు – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్ లేదా తగినన్ని, ఉప్పు – తగినంత , తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా దినుసులు..
బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – 2 ముక్కలు (చిన్నవి), యాలకులు – 3, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, సాజీరా – ఒక టీ స్పూన్.
పచ్చి బఠాణీ పులావ్ తయారీ విధానం..
ముందుగా అడుగు భాగం మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తరువాత మసాలా దినుసులను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత జీడిపప్పును, పచ్చి మిర్చిని వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి వేయించాలి. తరువాత పుదీనాను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు పచ్చి బఠాణీని వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నానబెట్టుకున్న బాస్మతీ బియ్యాన్ని వేసి చిన్న మంటపై 2 నిమిషాల పాటు వేయించి.. ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి తగినంత ఉప్పును వేసి కలిపి నీళ్లు కాగి బియ్యం ఉడికే వరకు మధ్యస్థ మంటపై ఉంచి.. తరువాత మంటను చిన్నగా చేసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి.. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి బఠాణీ పులావ్ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా ఏదైనా మసాలా కూరలతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా పచ్చి బఠాణీలలో ఉండే పోషకాలను పొందవచ్చు. ఇలా తరచూ పచ్చి బఠాణీలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, శరీరంలో వాపులను, నొప్పులను తగ్గించడంలో పచ్చి బఠాణీలు ఎంతగానో ఉపయోగపడతాయి.