Tomato Chutney : మనం వంటింట్లో ఎక్కువగా వాడే కూరగాయలలో టమాటాలు ఒకటి. టమాటాలు లేని వంటగది ఉండనే ఉండదని చెప్పవచ్చు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. వీటితో కూరలనే కాకుండా మనం వివిధ రకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉదయం చేసే అల్పాహారాలను తినడానికి టమాట చట్నీని ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్దగా తరిగిన టమాటాలు – 5 లేదా 6, నూనె – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిరపకాయలు – 5 లేదా రుచికి తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, నీళ్లు – కొద్దిగా.
టమాట చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి కాగిన తరువాత మినప పప్పును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాటాలలోని నీరు అంతా పోయి టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. టమాట ముక్కలు చల్లగా అయిన తరువాత వీటన్నింటిని ఒక జార్ లో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను, కొత్తిమీరను వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉప్పును, తగినన్ని నీళ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట చట్నీ తయారవుంది. దీనిని ఉదయం అల్పాహారంలో భాగంగా చేసే దోశ, ఉప్మా, ఊతప్పం, ఇడ్లీ, గారెలు, వడలు వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.