Banana Chips : మనం ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ పచ్చి అరటి కాయలను కూడా తీసుకుంటూ ఉంటాం. అరటి పండ్ల లాగా పచ్చి అరటికాయలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి అరటికాయలల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి అరటికాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. పచ్చి అరటికాయలతో కూరను గానీ , ఫ్రైను గానీ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. వీటితో చిప్స్ ను కూడా తయారు చేస్తూ ఉంటారు. పచ్చి అరటికాయలతో చేసే చిప్స్ చాలా రుచిగా ఉంటాయి. ఈ చిప్స్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటిని మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పచ్చి అరటికాయలతో చిప్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి కాయ చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి అరటి కాయలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, కారం – తగినంత.
అరటికాయ చిప్స్ తయారీ విధానం..
ముందుగా పచ్చి అరటి కాయలను తీసుకుని వాటికి నిలువుగా గాట్లు పెట్టి పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు వాటిని అడ్డంగా కత్తితో సన్నగా తరగాలి. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఉప్పును, పసుపును వేసి ముందుగా తరిగి పెట్టుకున్న అరటికాయలను వేసి 2 నిమిషాల పాటు ఉంచాలి. 2 నిమిషాల తరువాత వీటిని తీసి ఒక పొడి వస్త్రంపై ఉంచి తడి లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ఒక్కొక్కటిగా అరటికాయ ముక్కలను వేసి మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన వాటిని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి కానీ గిన్నెలోకి తీసుకుని కొద్ది సేపటి తరువాత టిష్యూను తొలగించి అరటి కాయ చిప్స్ పై ఉప్పును, కారాన్ని చల్లుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అరటికాయ చిప్స్ తయారవుతాయి. వీటిని స్నాక్స్ గా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి.