Bendakaya Vepudu : మనం రకరకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో బెండకాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా బెండకాయలు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఇవి జిగురుగా ఉంటాయన్న కారణంగా వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. తరచూ చేసే బెండకాయ ఫ్రై కి బదులుగా కింద చెప్పిన విధంగా చేసే బెండకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన బెండకాయ వేపుడును అందరూ ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బెండకాయలు – అర కిలో, శనగ పిండి – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి – అర టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – అర టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, నీళ్లు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – రెండు రెబ్బలు, పల్లీలు – రెండు టేబుల్ స్పూన్స్, జీడి పప్పు – తగినంత, సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బెండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో తరిగిన బెండకాయలను తీసుకుని అందులో శనగ పిండిని, బియ్యం పిండిని, మైదా పిండిని, కార్న్ ఫ్లోర్ ను, పసుపును, కారాన్ని, ఉప్పును వేసి బెండకాయ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లను పోసి కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత కొద్ది కొద్దిగా బెండకాయ ముక్కలను వేసి వేయించి టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఉల్లిపాయలను, కరివేపాకును, పల్లీలను, జీడిపప్పును ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసి బెండకాయ ముక్కలల్లో వేసుకోవాలి. వీటిలోనే తగినంత ఉప్పును, కారాన్ని, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడు తయారవుతుంది. దీనిని నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలను తినలేని వారు ఇలా వేపుడును చేసుకుని తినడం వల్ల రుచితోపాటు బెండకాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.