Sugandhi Pala Mokka : ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించే మొక్కలలో సుగంధి పాల మొక్క ఒకటి. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సుగంధి పాల మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు దీనిని విరివిరిగా ఔషధంగా వాడే వారు. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ఇది బహువార్షిక తీగ మొక్క. ఈ మొక్క సుమారు 6 మీటర్ల వరకు పెరుగుతుంది. సుగంధి పాల మొక్క వేరు చక్కని సువాసనను కలిగి ఉంటుంది. ఈ వేరును శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించగా ఎర్రని కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. శరీరంలో ఉండే వేడి అంతా పోయి చలువ చేస్తుంది. అధిక వేడితో బాధపడేవారు ఈ కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అధిక వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.
అంతేకాకుండా సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. ఈ కషాయాన్ని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఈ సుగంధి పాల మొక్క వేరును కడిగి నేరుగా నోట్లో పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు కాంతివంతంగా కూడా తయారవుతంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో, అలాగే మూత్రం సాఫీగా వచ్చేలా చేయడంలో కూడా ఈ సుగంధి పాల మొక్క వేరు కషాయం ఉపయోగపడుతుంది.
ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తం శుద్ధి అవ్వడంతోపాటు, రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. పిల్లల్లో నత్తి తగ్గి మాటలు సరిగ్గా వచ్చేలా చేయడంలో, జ్ఞాపక శక్తిని పెంచడంలో ఈ మొక్క వేరు కషాయం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలతో బాధపడేవారు, ఒత్తిడికి గురయ్యేవారు తరచూ ఈ కషాయాన్ని తాగడం వల్ల వారు ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేలా చేయడంలో కూడా సుగంధి పాల మొక్క వేరు కషాయం దోహదపడుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల పురుషులల్లో వీర్య కణాల సంఖ్య పెరగడంతోపాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుంది.
ఈ మొక్క వేరును నూరి ఆ గంధాన్ని లేపనంగా రాయడం వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. అంతేకాకుండా ఈ గంధాన్ని లేపనంగా రాయడం వల్ల తామర వంటి చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. పిప్పి పన్ను నొప్పిని తగ్గించడంలో ఈ మొక్క ఆకులు సహాయపడతాయి. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి ఆ ముద్దను పిప్పి పన్ను పై ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల కదిలిన దంతాలు కూడా గట్టిపడతాయి.
సుగంధి పాల మొక్క వేరును పేస్ట్ లా చేసి లేపనంగా రాయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ మొక్క వేరును ఎండబెట్టి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 2 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ పొడిని 3 గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకోవడం వల్ల బాలింతలలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. 2 గ్రాముల సుగంధి పాల మొక్క వేరు పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసుకుని కలిపి రెండు పూటలా తాగడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా సుగంధి పాల మొక్క మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.