Drumstick Leaves Paratha : మన చుట్టూ అనేక చోట్ల కనిపించే చెట్లలో మునగ చెట్టు ఒకటి. దీన్ని భాగాలు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. మునగాకులు, పువ్వులు, కాయలను మనం తినవచ్చు. అయితే మునగ కాయలను అంటే కూరగా లేదా పలు ఇతర వంటల్లో వేసి తింటుంటారు. కానీ మునగాకులు లేదా పువ్వులను ఎలా తినడం ? అని కొందరు సందేహిస్తుంటారు. అయితే మునగాకులను మనం సులభంగా తినవచ్చు. నేరుగా తినడం ఇష్టపడని వారు వాటితో పరోటాలు తయారు చేసి తినవచ్చు. వీటిని తయారు చేయడం కూడా సులభమే. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. మునగాకుల పరోటాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకుల పరోటాల తయారీకి కావల్సిన పదార్థాలు..
మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి – ఒక కప్పు, మునగాకులు – అర కప్పు, ఉల్లిపాయల తరుగు – పావు కప్పు, పచ్చి మిర్చి – అర టీస్పూన్, ఉప్పు – పావు టీస్పూన్, వాము – పావు టీస్పూన్, నూనె – పావు కప్పు.
మునగాకుల పరోటాలను తయారు చేసే విధానం..
మునగాకులను ముందుగా బాగా కడగాలి. తరువాత అందులో సరిపడా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఇది చల్లారక నీటిని పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి. తరువాత పిండిపై మూత పెట్టి 30 నిమిషాల పాటు ఉంచాలి. సమయం ముగిశాక కొద్దిగా పిండి తీసుకుని పరోటాలా చేసి పెనం మీద వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మిగిలిన పిండితోనూ పరోటాలను తయారు చేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉంటే మునగాకుల పరోటాలు తయారవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా కూరతో తిన్న బాగానే ఉంటాయి. మునగాకులను నేరుగా తినలేమని అనుకునేవారు వాటితో ఇలా పరోటాలను తయారు చేసి తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ పొందవచ్చు.