Edema : మన శరీరంలో అప్పుడప్పుడు కొన్ని భాగాలు వాపులకు గురవుతుంటాయి. ఏదైనా గాయం లేదా దెబ్బ తగిలితే సహజంగానే ఈ వాపులు వస్తుంటాయి. కానీ కొందరికి మాత్రం పాదాల వాపులు వస్తుంటాయి. ఇవి ఏం చేసినా తగ్గవు. పాదాల వాపులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కిడ్నీ సమస్యలు, గాయాలు, ఇన్ఫెక్షన్లు, కీళ్ల వాపులు వంటి కారణాల వల్ల పాదాలు వాపులకు గురవుతుంటాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడేది ఎలా.. అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. కింద తెలిపిన పలు చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగానే బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక బకెట్‌లో గోరు వెచ్చని నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి బాగా కలపాలి. అనంతరం అందులో పాదాలు మునిగేలా ఉంచాలి. ఇలా 15-20 నిమిషాలు ఉన్న తరువాత పాదాలను తీసేయాలి. ఈ విధంగా రోజుకు 2 సార్లు చేయడం వల్ల పాదాల వాపులు సులభంగా తగ్గుతాయి. రాక్ సాల్ట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పాదాల వాపులను తగ్గిస్తాయి. దీంతో సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
పాదాల వాపులు ఉన్నవారు నిద్రించేటప్పుడు పాదాల కింద ఎత్తుగా ఉండేలా దిండు కానీ ఏదైనా మెత్తని వస్తువును కానీ ఉంచాలి. పాదాలు ఎత్తులో ఉండడం వల్ల అక్కడ ఉండే నీరు కిందకు వస్తుంది. అది రక్త సరఫరాలో కలిసిపోతుంది. తరువాత మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇలా చేయడం వల్ల కూడా పాదాల వాపులు తగ్గుతాయి.
పాదాల వాపులను తగ్గించుకోవాలంటే అందుకు పుచ్చకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిల్లో 92 శాతం నీరే ఉంటుంది. ఇందులో సహజసిద్ధమైన డైయురెటిక్ పదార్థాలు ఉంటాయి. ఇవి పాదాల్లో ఉండే ద్రవాలను తగ్గిస్తాయి. దీంతో పాదాల వాపులు తగ్గుతాయి. ఈ సమస్య ఉన్నవారు రోజూ ఒక కప్పు మోతాదులో పుచ్చకాయ ముక్కలను తింటే తగిన ఫలితం ఉంటుంది.
ధనియాలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక ఇవి కూడా పాదాల వాపులను తగ్గించగలవు. ఆయుర్వేదంలో పాదాల వాపులకు ధనియాలను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇందుకు గాను ఒక కప్పు నీటిలో 2-3 టీస్పూన్ల ధనియాలను వేసి మరిగించాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించిన తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. అనంతరం దాన్ని చల్లార్చి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. దీంతో పాదాల వాపులు తగ్గుతాయి. ఈవిధంగా సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి పాదాల వాపుల సమస్య నుంచి బయట పడవచ్చు.