Jangiri : మనలో తీపి పదార్థాలను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. మనకు బయట వివిధ రకాల తీపి పదార్థాలు దొరుకుతూ ఉంటాయి. మనకు బయట దొరికే తీపి పదార్థాలలో జాంగ్రీ కూడా ఒకటి. జాంగ్రీ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మనకు బయట నోట్లో వేసుకోగానే కరిపోయేలా ఉండే జాంగ్రీలు లభిస్తాయి. బయట దొరికే విధంగా ఉండే ఈ జాంగ్రీలను మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ జాంగ్రీలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాంగ్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు, వంటసోడా – పావు టీ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్- కొద్దిగా, పంచదార – 2 కప్పులు, నీళ్లు – ముప్పావు కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నిమ్మ రసం – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
జాంగ్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినప పప్పును తీసుకుని తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మినప పప్పను శుభ్రంగా కడిగి జార్ లో వేసి కొద్దిగా నీటిని పోసి మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, వంటసోడా, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా ఉంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ ను వేసుకుని కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పంచదారను, నీళ్లను పోసి చిన్న మంటపై పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి పంచదార లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించిన తరువాత యాలకుల పొడి, నిమ్మ రసం వేసి కలిసి స్టవ్ ఆఫ్ చేయాలి.
తరువాత ఒక కళాయిలో నూనె పోసి నూనె మధ్యస్థంగా కాగిన తరువాత ఒక వస్త్రాన్ని కానీ ప్లాస్టిక్ కవర్ ను తీసుకుని అందులో పిండిని వేసి ఒక మూలగా పట్టుకుని దానికి చిన్న రంధ్రాన్ని చేయాలి. ఆ రంధ్రంలోంచి పిండి వచ్చేలా జాంగ్రీ ఆకారంలో నూనెలో పిండి వత్తాలి. ఇలా కొన్ని జాంగ్రీలను నూనెలో కాల్చాలి. వాటిని మధ్యస్థ మంటపై రెండు దిక్కులా గట్టి పడే వరకు కాల్చుకుని వాటిని నూనె నుంచి తీసి వెంటనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి 2 నిమిషాల పాటు ఉంచి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జాంగ్రీలు తయారవుతాయి.
వీటి తయారీలో వస్త్రాన్ని కానీ, ప్లాస్టిక్ కవర్ ను కానీ ఉపయోగించడం రాని వారు ఒక ప్లాస్టిక్ బాటిల్ ను తీసుకుని అందులో పిండిని వేసి దాని మూతకు రంధ్రాన్ని చేసి కూడా జాంగ్రీలను నూనెలో వేసుకోవచ్చు లేదా బయట టమాట కెచప్ ను ఉంచే బాటిల్ ను ఉపయోగించి కూడా జాంగ్రీలను వేసుకోవచ్చు. జాంగ్రీల ఆకారంలా వత్తుకోవడం రాని వారు వీటిని జిలేబీలా కూడా వత్తుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా బయట దొరికే విధంగా ఉండే జాంగ్రీలు తయారవుతాయి. వీటిని ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి వీటి రుచిని ఆస్వాదించవచ్చు.