Ghee Mysore Pak : మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు బయట మార్కెట్ లో కూడా రకరకాల తీపి పదార్థాలు లభ్యమవుతుంటాయి. బయట దొరికే కొన్ని రకాల తీపి పదార్థాలను మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో నెయ్యితో చేసే మైసూర్ పాక్ కూడా ఒకటి. శనగపిండితో చేసే ఈ నెయ్యి మైసూర్ పాక్ ఎంతో రుచిగా ఉంటుంది. బయట దొరికే విధంగా ఉండే నెయ్యి మైసూర్ పాక్ ను మనం ఇంట్లో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ మైసూర్ పాక్ ను ఇంట్లో రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి మైసూర్ పాక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, నెయ్యి – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు.
నెయ్యి మైసూర్ పాక్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో శనగపిండిని వేసి చిన్న మంటపై పచ్చి వాసన పోయి రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించిన శనగ పిండిని ఒక జల్లి గరిటెలో వేసి ఉండలు లేకుండా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టిన శనగ పిండిని ఒక గిన్నెలో వేసి అందులోనే నెయ్యిని పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత ఒక కళాయిలో పంచదారను, నీళ్లను పోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత లేత పాకం వచ్చే వరకు ఉడికించాలి. లేత పాకం వచ్చిన తరువాత ముందుగా నెయ్యి వేసి కలిపి పెట్టుకున్న శనగ పిండి మిశ్రమాన్ని వేసి పంచదార పాకం, శనగ పిండి పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడే వరకు పది నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికిస్తూనే రెండు నిమిషాలకొకసారి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి.
శనగ పిండి మిశ్రమం కళాయికి అతుక్కోకుండా వేరయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను లేదా ప్లేట్ ను తీసుకుని దానికి నెయ్యిని రాసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగ పిండి మిశ్రమాన్ని వేసి సమానంగా విస్తరించాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లగా అయిన తరువాత కావల్సిన పరిమాణంలో కత్తితో గాట్లు పెట్టుకోవాలి. శనగ పిండి మిశ్రమం పూర్తిగా చల్లగా అయ్యి గట్టిపడిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని గాట్లు పెట్టుకున్న ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నెయ్యి మైసూర్ పాక్ తయారవుతుంది. దీనిని మనకు కావల్సిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల అచ్చం బయట దొరికే విధంగా ఉండే నెయ్యి మైసూర్ పాక్ తయారవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.