Sponge Cake : మనకు బయట బేకరీల్లో లభించే వాటిల్లో కేక్ కూడా ఒకటి. దీనిని చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుత కాలంలో ప్రతి శుభకార్యంలోనూ కేక్ ఉంటోంది. మనకు వివిధ రుచుల్లో కేక్ లభిస్తూ ఉంటుంది. దీనిని తయారు చేయాలంటే ఒవెన్ తప్పకుండా ఉండాలని చాలా మంది భావిస్తారు. కానీ ఒవెన్ లేకుండానే మనం చాలా సులువుగా ఇంట్లో కేక్ ను తయారు చేసుకోవచ్చు. ఒవెన్ లేకుండా కేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెనీలా స్పాంజ్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, పంచదార పొడి – ఒకటిన్నర కప్పు లేదా తగినంత, బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, కోడిగుడ్లు – 2, నూనె – అర కప్పు, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, చల్లని పాలు – 2 టేబుల్ స్పూన్స్.

వెనీలా స్పాంజ్ కేక్ తయారీ విధానం..
ముందుగా కొద్దిగా పెద్దగా ఉండే గిన్నెను తీసుకుని దానిపై ఒక జల్లి గంటెను ఉంచాలి. తరువాత ఆ జల్లిగంటెలో కొద్ది కొద్దిగా మైదా పిండిని వేస్తూ జల్లించుకోవాలి. తరువాత పంచదార పొడిని, బేకింగ్ పౌడర్ ను, ఉప్పును కూడా వేసి జల్లించి ఆ గిన్నెను పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో కోడిగుడ్లను, నూనెను, వెనీలా ఎసెన్స్ ను, పాలను పోసి ఒక నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమంలో వేయాలి. దీనిని ఒకే దిశలో అంతా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత అడుగు భాగం మందంగా ఉండే కళాయిని కానీ, కుక్కర్ ను కానీ తీసుకుని స్టవ్ మీద ఉంచాలి. ఈ కుక్కర్ లో అర కిలో ఉప్పును లేదా ఇసుకను వేసి సమానంగా విస్తరించాలి.
తరువాత అందులో ఒక స్టాండ్ ను ఉంచి కుక్కర్ లేదా కళాయి మీద మూత ఉంచి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఒక బేకింగ్ గిన్నెను తీసుకుని దానికి నెయ్యిని లేదా బటర్ ను రాయాలి. ఇలా రాసిన తరువాత దానిపై కొద్దిగామైదా పిండిని కూడా చల్లుకోవాలి. ఇలా చేసిన తరువాత అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి మధ్యలో గాలి బుడగలు లేకుండా అంతా సమానంగా చేయాలి. ఇలా చేసిన తరువాత ఈ బేకింగ్ గిన్నెను కుక్కర్ లేదా కళాయిలో ఉంచి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థానికి, పెద్ద మంటకు మధ్యలో మంటను ఉంచి 30 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత ఒక టూత్ పిక్ ను తీసుకుని కేక్ మధ్యలో గుచ్చాలి. టూత్ పిక్ కు ఏమి అతుక్కోకుండా ఉంటే కేక్ ఉడికిందిగా భావించి స్టవ్ ఆఫ్ చేయాలి లేదా మరో 5 నుండి 8 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నెను కుక్కర్ నుండి బయటకు తీసి కత్తితో అంచులను గిన్నె నుండి వేరు చేసి కేక్ ను వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ కేక్ ను మనకు కావల్సిన పరిమాణంలో ముక్కలుగా చేసుకుని తినవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పాంజ్ కేక్ తయారవుతంది. దీనికి విప్పింగ్ క్రీమ్ ను రాసి పైన చెర్రీలతో కానీ చాక్లెట్ పౌడర్ తో కానీ గార్నిష్ చేసుకుంటే అచ్చం బయట దొరికే విధంగా ఉండే కేక్ తయారవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.