Kakarakaya Karam : చేదుగా ఉండే కూరగాయలు అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి కాకరకాయలు. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో కాకరకాయల్లో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సరిగ్గా వండాలే కానీ కాకరకాయ కారం చేదుగా లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది. వెల్లుల్లిని వేసి చేదు లేకుండా కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకర కాయలు – పావు కిలో, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిర్చి – 5, ఎండు కొబ్బరి – 1 (రెండు ఇంచుల ముక్క), వెల్లుల్లి రెబ్బలు – 5, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
కాకరకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం..
ముందుగా కాకర కాయలపై ఉండే పొట్టును తీసేసి వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత కాకరకాయలను గుండ్రంగా సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ కాకర కాయ ముక్కల్లో ఒక ఈ టీ స్పూన్ ఉప్పును, పసుపును వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత కాకరకాయ ముక్కలను చేత్తో బాగా నలిపి తగినన్ని నీళ్లు పోసి వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత కాకరకాయ ముక్కల్లో ఉండే రసాన్ని చేత్తో బాగా పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నువ్వులను వేసి వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఎండు మిర్చిని, ఎండు కొబ్బరి ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును వేసి బాగా మిక్సీ పట్టాలి.
తరువాత కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ముందుగా రసం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి మధ్యస్థ మంటపై కాకరకాయ ముక్కలు కరకరలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసి ఒక నిమిషం పాటు కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మూత తీసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం తయారవుతుంది. కాకర కాయ చేదుగా ఉంటుందని చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయ కారం చేదు తక్కువగా ఉండడమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చేయడం వల్ల చేదు తగలకుండా కాకరకాయలను తినవచ్చు.