Beauty Tips : మనలో చాలా మందిని వేధిస్తున్న చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. ముఖంపై మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం వంటి వాటితోపాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా ముఖంపై మొటిమలు వస్తాయి. కొందరిలో మొటిమలు వచ్చి తగ్గిన తరువాత వాటి స్థానంలో చర్మంపై గుంతలు ఏర్పడతాయి. వీటి వల్ల ఎటువంటి సమస్య లేనప్పటికీ ఈ గుంతల కారణంగా ముఖం అందవిహీనంగా కనబడుతుంది. దీంతో కొందరు ఆత్మనూన్యత భావనకు గురవుతుంటారు.
మొటిమల కారణంగా ఏర్పడ్డ ఈ గుంతలను మనం ఆయుర్వేదం ద్వారా తొలగించవచ్చు. మనకు విరివిరిగా కనిపించే ఉత్తరేణి మొక్కను ఉపయోగించి ముఖంపై ఏర్పడ్డ గుంతలను మాములు చర్మంలో కలిసిపోయేలా చేసుకోవచ్చు. మొటిమల కారణంగా వచ్చిన గుంతలను తగ్గించడంలో మనకు ఉత్తరేణి మొక్క ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరేణి మొక్కను సంస్కృతంలో మయూరక, కరమంజరి అని పిలుస్తారు. ఈ మొక్క సమూల రసం చేదుగా ఉంటుంది. మనకు వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను తగ్గించడంలో కూడా ఈ మొక్క మనకు ఉయోగపడుతుంది.
ఆయుర్వేదంలో ఈ మొక్కను విరివిరిగా ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖంపై గుంతలతో బాధపడుతున్న వారు ఉత్తరేణి మొక్కకింద భాగంలో లావుగా ఉండే వేరును సేకరించి శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. ఈ వేరు ఎండిన తరువాత దానిని నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖంపై గుంతలు ఉన్న చోట మందంగా లేపనంగా రాసి ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా మొటిమల కారణంగా వచ్చిన గుంతలు తగ్గి సాధారణ చర్మంలో కలిసిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ముఖం కూడా అందంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది.