Ginger Chicken : చికెన్ అంటే మాంసాహార ప్రియులు అందరికీ దాదాపుగా ఎంతో ఇష్టంగానే ఉంటుంది. చికెన్‌తో అనేక రకాల వెరైటీలను వండుకుని తింటుంటారు. దీంతో అనేక రకాల కూరలను చేయవచ్చు. అయితే అల్లం చికెన్ కూర ఎంతో రుచిగా, ఘాటుగా ఉంటుంది. చికెన్ ఘాటుగా ఉండాలని కోరుకునే వారు అల్లం చికెన్ వండుకుని తినవచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక అల్లం చికెన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అరకిలో, అల్లం పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత, కోడిగుడ్డు – ఒకటి, కార్న్‌ఫ్లోర్ – మూడు టేబుల్ స్పూన్లు, నూనె – సరిపడా, ఎండు మిర్చి – మూడు, చికెన్ మసాలా – రెండు టేబుల్ స్పూన్లు, చికెన్ సూప్ – అర కప్పు, ఉల్లిపాయలు – రెండు.
అల్లం చికెన్ తయారు చేసే విధానం..
చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి అల్లం పేస్ట్, కొద్దిగా ఎండు మిర్చి పేస్ట్, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మారినేట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో కోడిగుడ్డు పగలగొట్టి వేయాలి. అందులో కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్ ముక్కలు వేసి వేయించాలి. చికెన్ ముక్కలు బాగా వేగిన తరువాత తీసి బౌల్‌లోకి మార్చుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత దంచిన అల్లం వేయాలి. మిగిలిన ఎండు మిర్చి పేస్టు, చికెన్ మసాలా, చికెన్ సూప్, కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుకోవాలి. చివరగా వేయించిన చికెన్ ముక్కలు వేసి కలియబెట్టుకోవాలి. కాసేపు ఉడికించిన తరువాత ముక్కలు ఉడికిందీ లేనిదీ చూసుకోవాలి. ముక్కలు ఉడికితే మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. దీంతో రుచికరమైన అల్లం చికెన్ తయారవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.