Ather 450x Gen 3 : హీరో మోటోకార్ప్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏథర్ ఎనర్జీ మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎథర్ 450ఎక్స్ సిరీస్‌లో ఏథర్ 450ఎక్స్ జెన్3 పేరిట సదరు స్కూటర్‌ను లాంచ్ చేసింది. గత మోడల్స్‌తో పోలిస్తే దీంట్లో మైలేజీ, ఇతర ఫీచర్లు అదనంగా లభిస్తున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. కాగా ఏథర్ 450 సిరీస్ తొలి స్కూటర్లను 2018లో ప్రవేశపెట్టగా సెకండ్ జనరేషన్ స్కూటర్లను 2020లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు 3వ జనరేషన్ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఇక ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నామని కంపెనీ ప్రతినిధుల తెలిపారు.
కొత్త ఏథర్ 450ఎక్స్ జెన్ 3 స్కూటర్‌లో 3.7 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల మైలేజీ పెరుగుతుంది. గత మోడల్స్ కన్నా ఈ మోడల్ మైలేజీ 25 శాతం పెరిగిందని అన్నారు. అలాగే ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 146 కిలోమీటర్ల మేర మైలేజ్ వస్తుంది. అదే సిటీలో రోడ్లపై అయితే 105 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను పొందవచ్చు. ఈ క్రమంలోనే ఈ స్కూటఱ్లో 5 రకాల రైడ్ మోడ్స్‌ను అందిస్తున్నారు. వార్ప్, స్పోర్ట్, రైడ్, స్మార్ట్ ఎకో, ఎకో అనే మోడ్స్‌లో దీనిపై రైడ్ చేయవచ్చు.
ఈ స్కూటర్ లో అధునాతన డ్యాష్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే టైర్లలో ఎప్పటికప్పుడు ప్రెషర్‌ను తెలుసుకునేందుకు అధునాతన టీపీఎంఎస్ సిస్టమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. దీంతో మైలేజీ బాగా వస్తుంది. ఇక ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర ఢిల్లీలో రూ.1.39 లక్షలుగా ఉంది. ఈ క్రమంలోనే ఈ స్కూటర్‌ను ఈ ఏడాది చివరి వరకు 1 లక్ష యూనిట్లను అమ్మాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రతినిధులు వివరించారు. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో 30 శాతం వాటాను పొందాలని ఏథర్ భావిస్తోంది.