Washing Hands : సాధారణంగా చాలా మంది భోజనాన్ని చేతుల్తోనే తింటుంటారు. కొందరు మాత్రం స్పూన్లను ఉపయోగిస్తుంటారు. అయితే భోజనం ఎలా చేసినా సరే.. భోజనం అనంతరం పాటించాల్సిన నియమాలు కూడా ఉంటాయి. వాటిల్లో చేతులు కడుక్కోవడం కూడా ఒకటి. కొందరు భోజనం చేసిన వెంటనే ప్లేట్‌లోనే నీటితో చేతులను కడుగుతుంటారు. స్పూన్‌తో తిన్నా సరే కొందరు తిన్న ప్లేట్‌లోనే చేతులను కడుగుతారు. అయితే మన పురాణాలు చెబుతున్న ప్రకారం.. ఇలా చేయడం సరికాదట. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
భోజనాన్ని చేత్తో చేసినా లేదా స్పూన్‌తో తిన్నా.. చేతులను మాత్రం తిన్న ప్లేట్‌లోనే కడగరాదు. ఇలా చేస్తే.. అన్నపూర్ణా దేవితోపాటు లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుందట. ఎందుకంటే మనం తినే ఆహారం ఎంతో పవిత్రమైంది. అలాంటి ఆహారాన్ని తిన్న ప్లేట్‌లోనే చేతులను కడగడం అంటే పాపం చేసినట్లే అవుతుందట. కనుక భోజనం చేశాక ఎట్టి పరిస్థితిలోనూ ప్లేట్‌లో చేతులను కడగరాదు. అలాగే కొందరు భోజనం ఉన్న ప్లేట్‌ను కేవలం ఒకే చేత్తో పట్టుకుంటారు. అలా చేసినా కూడా అన్నపూర్ణా దేవిని, లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతందట. దీంతో వారికి ఆహారం, డబ్బు ఉండదని పండితులు చెబుతున్నారు. కాబట్టి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.
ఇక భోజనం చేసేటప్పుడు భోజనంపైనే దృష్టి పెట్టాలి. కొందరు ఫోన్ లేదా టీవీ చూస్తూ.. కొందరు పుస్తకాలు చదువుతూ తింటారు. ఇలా చేసినా కూడా మనం తినే ఆహారాన్ని అవమానించినట్లే అవుతుందట. కనుక ఈవిధంగా కూడా చేయకూడదు. భోజనం చేసేటప్పుడు ధ్యాస అంతా మనం తినే ఆహారంపైనే ఉండాలి. ఎంతో శ్రద్ధగా, ఎలాంటి కోపం, ఆవేశాలు లేకుండా ప్రశాంతంగా భోజనం చేయాలి. అప్పుడే అన్నపూర్ణా దేవి సంతోషిస్తుంది. మన ఇంట్లో భోజనానికి లోటు లేకుండా చూస్తుంది. దీంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.