Veg Frankie : మనకు బయట రెస్టారెంట్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఎక్కువగా దొరికే వాటిల్లో వెజ్ ఫ్రాంకీలు కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. బయట దొరికే విధంగా ఉండే ఈ వెజ్ ఫ్రాంకీలను మనం చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ ఫ్రాంకీలను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఫ్రాంకీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, మైదా పిండి – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంపలు – 2, నూనె – రెండున్నర టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – రెండు కప్పులు, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, క్యారెట్ తురుము – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, క్యాబేజ్ తురుము – అర కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ – 1, సన్నగా పొడుగ్గా తరిగిన క్యాప్సికం – 1, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1.
వెజ్ ఫ్రాంకీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని, మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోనే ఉప్పును, నూనెను వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక కళాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత క్యారెట్ తురుమును వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
తరువాత మెత్తగా చేసిన బంగాళాదుంపలను వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరో 3 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నానబెట్టుకున్న పిండిని మరోసారి కలిపి కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ముద్దను తీసుకుంటూ పొడి పిండి వేసుకుంటూ చపాతీలలా చేసుకోవాలి. ఈ చపాతీని పెనం మీద వేసి నూనె లేదా వెన్న వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని గాలి తగలకుండా ఉంచాలి.
ఇలా అన్నీ చపాతీలను కాల్చుకున్న తరువాత ఒక్కో చపాతీని తీసుకుంటూ చపాతీపై నిలువుగా క్యారెట్ తురుమును, క్యాబేజ్ తురుమును ఉంచాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత దీనిపైనే ఉల్లిపాయ ముక్కలను, క్యాప్సికం ముక్కలను ఉంచి గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఫ్రాంకీలు తయారవుతాయి.
ఈ వెజ్ ఫ్రాంకీలను పూర్తిగా గోధుమ పిండితో లేదా పూర్తిగా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వెజ్ ఫ్రాంకీలను అందరూ ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకున్న వెజ్ ఫ్రాంకీలను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.