ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కలను ప్రసాదించింది. ఈ మొక్కలు మన చుట్టూనే ఉన్నా వాటిలో ఉండే ఔషధ గుణాలు తెలియక వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. పిచ్చి మొక్కలుగా భావించిన మొక్కలే మనకు వచ్చిన అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఉపయోగపడుతున్నాయి. అలాంటి మొక్కల్లో అతిబల మొక్క కూడా ఒకటి. గ్రామాల్లో, రోడ్లకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ విరివిరిగా ఈ మొక్క మనకు కనబడుతుంది.
దీనిని తుత్తుర బెండ, దువ్వెన కాయల చెట్టు, ముద్రబెండ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు అతిబల మొక్క ఆకులకు వెన్నను రాసి వేడి చేసి నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టుకట్టడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా ఈ మొక్క ఆకుల రసాన్ని ఆవ నూనెలో వేసి నూనె మిగిలే వరకు వేడి చేసి ఆరిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని పై పూతగా రాయడం వల్ల కూడా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
అతిబల మొక్క ఆకుల కషాయంలో కండచక్కెర కలుపుకుని తాగడం వల్ల గుండెదడ, అయాసం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. పిప్పి పన్ను, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఆరు అతిబల మొక్క ఆకులను సేకరించి వాటి నుండి రసాన్ని తీసి ఆ రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా మూడు రోజుల పాటు చేయడం వల్ల దంతాల సమస్యలు తొలగిపోతాయి. గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
అతిబల ఆకులను ఉడికించి ముద్దగా చేసి నడుముపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేయడం వల్ల నడుము నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అతిబల మొక్క వేరును పాలలో వేసి మరిగించి వడకట్టాలి. ఈ పాలలో కండచక్కెర కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల పురుషుల్లో వచ్చే శీఘ్రస్కలన సమస్య తగ్గడంతోపాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
స్తనాల వాపుతో ఇబ్బందిపడుతున్న స్త్రీలు ఈ మొక్క వేరును మంచి నీటితో నూరి ఆ గంధాన్ని స్తనాలపై లేపనంగా రాయడం వల్ల స్తనాల వాపు తగ్గుతుంది. కుక్క కరిచినప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని 60 ఎంఎల్ మోతాదులో కుక్క కరిచిన వారికి తాగించడంతోపాటు ఈ ఆకులను మెత్తగా నూరి కుక్క కరిచిన చోట ఉంచి కట్టుకట్టడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. ఈ విధంగా అతిబల మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యల నుండి మనకు సత్వరమే ఉపశమనం కలుగుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.