Biyyam Punugulu : మనం ఉదయం అల్పాహారంగా లేదా సాంయంత్రం స్నాక్స్ గా చేసుకోదగిన వాటిల్లో పునుగులు కూడా ఒకటి. పునుగులు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం ఎక్కువగా మిగిలిన దోశపిండితో లేదా ఇడ్లీ పిండితో తయారు చేస్తూ ఉంటాం. ఇవే పునుగులను మనం బియ్యంతో కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యంతో తయారు చేసే పునుగులు కూడా చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే పునుగులకు బదులుగా మరింత రుచిగా బియ్యంతో పునుగులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – అర కప్పు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
బియ్యం పునుగుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఆ బియ్యాన్ని ఒక జార్ లోకి తీసుకుని కొద్దిగా నీటిని పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో బంగాళాదుంపలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యంపిండిలో వేసి కలుపుకోవాలి.
తరువాత వీటిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత బియ్యం పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పునుగులలా వేసుకోవాలి. ఈ పునుగులను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి పునుగులు తయారవుతాయి.
ఈ పునుగులను పల్లిచట్నీ, టమాటా చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్న పునుగులు నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. తిన్నా కూడా చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఇలా చేసిన ఈ బియ్యం పిండి పునుగులను అందరూ ఇష్టంగా తింటారు.