Pomegranate Peel : చూడడానికి ఎర్రగా ఉండి వెంటనే తినాలనిపించే పండ్లలో దానిమ్మ పండు కూడా ఒకటి. మార్కెట్ లో అన్ని కాలాల్లోనూ అధికంగా కనిపించే పండ్లల్లో ఈ దానిమ్మ కూడా ఒకటనే విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణంగా మనం దానిమ్మ పండ్లను వలిచి గింజలను తిని తొక్కలను పాడేస్తూ ఉంటాం. కానీ దానిమ్మ గింజలే కాకుండా దానిమ్మ తొక్క కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ తొక్కలో చర్మ ఆరోగ్యాన్ని, సౌందరాన్ని పెంచే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. దానిమ్మ తొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్కను సన్ స్క్రీన్ గా, మాయిశ్చరైజర్ గా, ఫేషియల్ స్క్రబ్ గానూ ఉపయోగించవచ్చు. దానిమ్మ తొక్కలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని, జుట్టును సంరక్షించడంలో సహాయపడతాయి. దానిమ్మ తొక్కను ఎండలో బాగా ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు.
ఈ పొడికి కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు నయం అవుతాయి. దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేసి మొటిమలు తగ్గేలా చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మనలో చాలా మంది వయస్సు తక్కువగా ఉన్నా వృద్ధులుగా కనిపిస్తారు. అలాంటి వృద్ధాప్య ఛాయలను తగ్గించే గుణం దానిమ్మ తొక్కలలో పుష్కలంగా ఉంటుంది.
దానిమ్మ తొక్కలతో చేసిన పొడికి పాలను కలిపి ముఖానికి రాసుకోవాలి. కొద్ది సమయం తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్త చర్మ కణాలు ఏర్పడి ముడతలు, వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ఈ పౌడర్ ను వాడడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య తగ్గడంతోపాటు చర్మం పొడి బారకుండా ఉంటుంది. అంతేకాకుండా దానిమ్మ తొక్కలో ఉండే ఏజెంట్స్ చర్మ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడతాయని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ తొక్కలతో చేసిన పౌడర్ ను వాడడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఈ విధంగా దానిమ్మ తొక్కలు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయని.. దానిమ్మ తొక్కలతో చేసిన పౌడర్ ను వాడడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.